ఉద్యోగులూ.. పారాహుషార్..! ఉద్యోగాలు ఊడే టైమ్ వచ్చింది..!!
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అలా ఉంటే అది కాలమే కాదు. ఎప్పటికప్పుడు పరిస్థుతులకు అనుగుణంగా అన్నీ మారుతూ ఉంటాయి. ఇప్పుడు సాఫ్ట్ వేర్ ఉద్యోగుల పరిస్థితి కూడా ఇంతే. ఒకప్పుడు సాఫ్ట్ వేర్ జాబ్ అంటే లైఫ్ బిందాస్ అనుకునేవాళ్లు. కానీ ఇప్పుడు ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలీని అయోమయ పరిస్థితుల్లో కాలం వెళ్లదీస్తున్నారు. గుండెలపై చెయ్యి వేసుకుని వణికిపోతున్నారు. పలు కంపెనీల పరిస్థితి కూడా ఇంతే. అవసరానికి మించి ఉద్యోగులను తీసుకుని డాబు దర్పం ప్రదర్శించిన కంపెనీలు ఇప్పుడు నేలచూపులు చూస్తున్నాయి. కంపెనీని కాపాడుకోవాలంటే ఉద్యోగులను తీసివేయడం తప్ప మరో మార్గం లేదని చేతులెత్తేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, బైజూస్ లాంటి ఎన్నో కంపెనీలు ఇదే బాటలో పయనిస్తున్నాయి.
ట్విట్టర్ ను ఎలాన్ మస్క్ టేకోవర్ చేశాక ఉద్యోగుల ఊచకోత మొదలైంది. దాదాపు 7వేల 5వందల మంది ఉద్యోగులను ఒక్క మెయిల్ తో ఇంటికి పంపించేశారు మస్క్. ట్విట్టర్లో పనిచేసే భారతీయ ఉద్యోగుల పరిస్థితి అయితే మరీ దారుణం. దాదాపు 80శాతం మంది ఇండియన్ ఎంప్లాయీస్ ట్విట్టర్ లో ఉద్యోగాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ట్వట్టర్లో ఉద్యోగుల తొలగింపుపై ఇంటాబయటా అనేక విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినా మస్క్ ఏమాత్రం వెనక్కు తగ్గట్లేదు. కంపెనీని బతికించుకోవాలంటే ఇంతకుమించి మరో మార్గం లేదని తేల్చేశారు. ఇదే బాటలో పయనిస్తోంది ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా. ఇది కూడా వేలాది మందిని ఇంటికి పంపించేందుకు సిద్ధమైంది. మెటాలో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 87వేల మందికి పైగా ఉద్యోగులు పని చేస్తున్నారు. వీరిలో కనీసం 10శాతం మందిని ఇంటికి పంపించేయడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకవేళ అదే జరిగితే కంపెనీ చరిత్రలో భారీ ఉద్వాసన ఇదే కానుంది.
కంపెనీలు ఖర్చులను తగ్గించుకునేందుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. గతంలో కంపెనీలకు ప్రకటనల ఆదాయం ఎక్కువగా ఉండేది. కానీ ఆయా కంపెనీలకు యాడ్స్ భారీగా తగ్గిపోయాయి. దీంతో ఆదాయం కోల్పోవాల్సి వస్తోంది. ఇలాంటప్పుడు ఖర్చు తగ్గించుకోవాలంటే తమ ముందున్న ఏకైక మార్గం ఉద్యోగులను తొలగించడమే. మెటా ఆదాయం గతేడాదితో పోల్చితే 52శాతం తగ్గింది. మరోవైపు ఇదే సమయంలో ద్రవ్యోల్బణం ముంచుకొస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కంపెనీ గట్టెక్కాలంటే ఉద్యోగులను తొలగించడం మినహా మరో మార్గం లేదని తేల్చేసింది మెటా.
ట్విట్టర్, మెటా సంస్థలు ఇప్పుడు ఉద్యోగులను తీసేస్తుండడంతో వార్తల్లో నిలిచాయి. అయితే ఇంతకుముందే పలు అమెరికన్ కంపెనీలను ఉద్యోగులను భారీగా తొలగించాయి. సీగేట్, ఇంటెల్, కాయిన్ బేస్, నెట్ ఫ్లిక్స్, స్నాప్ చాట్ లాంటి పెద్దపెద్ద సంస్థలు కూడా ద్రవ్యోల్బణాన్ని తట్టుకునే పరిస్థితుల్లో లేవు. అందుకే ఉద్యోగులను సాగనంపాయి. దీంతో వేలాది మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు. మరోవైపు కొత్త రిక్రూట్ మెంట్లను కూడా ఆపేశాయి. దీంతో ఉద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు కూడా ఒక శాతం ఉద్యోగులను తొలగించాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగే పరిస్థితులు ఉన్నాయని తెలుస్తోంది. 2023లో ద్రవ్యోల్బణం తారస్థాయికి చేరుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని బడాబడా కంపెనీలే రెసిషన్ ను తట్టుకోలేక చేతులెత్తేస్తున్నాయి. అలాంటప్పుడు భారతీయ కంపెనీలు ఇంకెంత దారుణాన్ని చవిచూస్తాయోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.






