ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

టాంటెక్స్ ఆధ్వర్యంలో డాల్లస్ లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

టాంటెక్స్ ఆధ్వర్యంలో డాల్లస్ లో ఘనంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

సంక్రాంతి లేదా సంక్రమణం అంటే చేరడం అని అర్ధం. సూర్యుడు మకర రాశిలో చేరగానే వచ్చే సంక్రాంతి పండుగ అంటే తెలుగు వాళ్ళకు ఎంతో ఇష్టం.  భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ ఎంత గొప్పగా  జరుగుతుందో వర్ణించడానికి మాటలు చాలవు. అమెరికా లో తెలుగువారు కూడా సంక్రాంతి పండుగను అంతే ఘనంగా జరుపుకొనేలా , అతిపెద్ద తెలుగు సంస్థలలో ఒకటైన టాంటెక్స్ వారు  ప్రత్యేక శ్రద్ధ తీసుకొంటారు.  ఈసారి కూడా సంప్రదాయానికి పెద్ద పీట వేసి , ఆధునికతను మేళవించి తెలుగు మనసులను రంజింపచేసారు.

ఈ సందర్భంగా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం (టాంటెక్స్) కోరింత్ లేక్ డాలస్ హైస్కూల్ లో ఏర్పాటు చేసిన “సంక్రాంతి సంబరాలు” అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణంలో, చూడ ముచ్చటైన సాంస్కృతిక కార్యక్రమాలతో ఎంతో ఘనంగా నిర్వహించ బడ్డాయి. సంస్థ 2016 అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, మరియు కార్యక్రమ సమన్వయకర్త రఘు గజ్జల ఆధ్వర్యంలో, సాంస్కృతిక సమన్వయకర్త జ్యోతి వనం ఈ కార్యక్రమాలను నిర్వహించారు. సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కళ్లకు కట్టినట్టు టాంటెక్స్ మహిళా కార్యవర్గ సభ్యులు సభా ప్రాంగణం అలంకరించారు. స్థానిక పీకాక్ ఇండియన్ రెస్టారెంట్ వారు పండుగ భోజనం వడ్డించారు. సుమారు 150 మంది బాలబాలికలు ఉత్సాహంగా పాల్గొన్న ఈ కార్యక్రమం, అచ్చమైన తెలుగు వాతావరణాన్ని అణువణువునా ప్రతిబింబించే పాటలకు, తెలుగింటి ఆచారాలను, వాటిలోని విశిష్టతను ఎంతో ఆదరంగా చూపించే సంగీత, నృత్య అంశాలకు పెద్ద పీట వేసిందనటంలో ఏ మాత్రం సందేహం లేదు.

చిన్నారులు ఆలపించిన అమెరికా జాతీయ గీతంతో కార్యక్రమం మొదలైనది. ప్రధాన వ్యాఖ్యాత ప్రణవి ఆద్యతం నవ్వుల జల్లులు కురిపించారు. శివ, రామ,  కృష్ణుని రూపాలతో సినిమా పాటల ప్రదర్శన, అలరులు కురియగ అంటూ సాగే సంప్రదాయక కూచిపూడి నృత్యాలతో  కార్యక్రమాలు ముందుకు కొనసాగాయి. ఎప్పుడూ కొత్తగా చేయాలనే తపనతో, సొంత వాయిద్య బృందంతో, బాలలు బాలికలు కలిసి  ప్రభల శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో సంక్రాంతి పాటల సమాహారం అనే కార్యక్రమం చేశారు, ఇది విశేష ఆదరణ పొందింది. ‘యమునా ఎందుకే నీవు’, అరబిక్ చిన్నారుల నాట్య సమాహారాలు ఆకట్టుకొన్నాయి. సమాజానికి ఉపయోగపడే సందేశాన్ని ఇవ్వాలనే  ఉద్దేశం తో స్థానిక కోరింత్ పోలీస్ సంస్థ నుండి విచ్చేసిన సిబ్బంది, మన ఇళ్ళల్లో దొంగతనాలు జరగకుండా ఏమి జాగ్రత్తలు తీసుకోవాలో వివరించారు.  వారిని టాంటెక్స్ పాలకమండలి మరియు కార్యనిర్వాహక సభ్యులు ఘనంగా సత్కరించారు. తెలుగు రాష్ట్రాలవారికి సుపరిచితుడు “మిమిక్రీ” రమేష్ విచ్చేసిన తెలుగు వారందరిని తన ధ్వననుకరణ విద్యతో ఆశ్చర్యచకితులను చేసారు, తన గాన ప్రతిభతో మెప్పించారు.

టాంటెక్స్ తక్షణ పూర్వాధ్యకులు డా. ఊరిమిండి నరసింహారెడ్డి మాట్లాడుతూ, “క్రిందటి సంవత్సరం తన మదిలో మెదిలిన “ప్రగతి పథంలో పది సూత్రాలు ” అనే ఒక ఆలోచన ను అక్షరసత్యం  చేసి చూపించిన కార్యవర్గ సభ్యులు, స్వచ్చంద కార్యకర్తలు అందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. టాంటెక్స్ వారిద్వారా డల్లాస్ లోనే కాక  ఉత్తర అమెరికా మొత్తంలో విశేష ప్రాచుర్యం పొందిన  స్వరమంజరి కార్యక్రమమే కాక, బాల సుబ్రహ్మణ్యం గారి స్వరాభిషేకం,100 వ నెల నెలా తెలుగు వెన్నెల సదస్సు ఇలా ఎన్నో ఘన విజయాలు సాధించిన 2015 సంవత్సరానికి అధ్యక్షులుగా ఉండడం తన పూర్వజన్మ సుకృతం” అని తెలిపారు.

తదుపరి, 2016 వ సంవత్సరానికి టాంటెక్స్ అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ తేట తెలుగులో, కొంత హాస్యం మరికొంత విజ్ఞానం కలగలిపి చేసిన ప్రసంగం తెలుగు జాతి ఘన కీర్తిని దిగంతాల వరకు వ్యాపింపచేసింది. ఆయన మాట్లాడుతూ   ” టాంటెక్స్ సంస్థ ఈ సంవత్సరంలో 30 వసంతాలు పూర్తి చేసుకొంటోంది దానిని “ముత్యోత్సవం” అంటారు, ముత్యాల్లాంటి కార్యకర్తల సహకారాలతో అమెరికా తెలుగు వారికి సేవ చేసుకొనే అదృష్టం టాంటెక్స్ ద్వారా కలిగింది, టాంటెక్స్ ఘన చరిత్ర కాపాడేలా నిరంతరం శ్రామికుడిలా కష్టపడతాను” అని ప్రమాణం చేసారు. తన అపార అనుభవంతో సంస్థ పురోభివృద్ధికి కృషి చేస్తాను,భావితరాన్ని మరిన్ని అవకాశాలతో ప్రోత్సహిస్తూ, యువతకు ప్రాధాన్యత కల్పిస్తూ మరియు ఎన్నో విన్నూత్న కార్యక్రమాలతో, మరింత సేవా తత్పరత కలిగిన సంస్థగా టాంటెక్స్ ను తీర్చిదిద్దుతాను అని తెలిపారు. తదనంతరం 2016 పాలక మండలి,  కార్యనిర్వాహక బృందాన్ని, సభకు పరిచయం చేశారు. క్రొత్తగా ఎన్నికైన పాలక మండలి సభ్యుడు డా.రాఘవ రెడ్డి , కార్యనిర్వాహక సభ్యులు లోకేష్ నాయుడు, శేఖర్ బ్రహ్మదేవర, ఉమామహేష్  పార్నపల్లి, పద్మశ్రీ తోట, శారద సింగిరెడ్డి లను పరిచయం చేశారు.

టాంటెక్స్ సంస్థకు గత కొన్ని సంవత్సరాలుగా సేవలందించిన కార్యవర్గ సభ్యులైన సునీల్ దేవిరెడ్డి, నీరజ పడిగెల, శశి కనపర్తి లను పుష్పగుచ్చములతో , ప్రత్యేక జ్ఞాపికలతో సన్మానించారు. పాలక మండలి అధిపతిగా పదవీవిరమణ చేసిన అజయ్ రెడ్డి గారికి మరియు 2015 అధ్యక్షుడు  డా. ఊరిమిండి నరసింహారెడ్డి గారికి శాలువా కప్పి, పుష్పగుచ్చములతో, ప్రత్యేక జ్ఞాపికలతో అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ , ఉత్తరాధ్యక్షులు కృష్ణా రెడ్డి ఉప్పలపాటి, కార్యవర్గ మరియు పాలకమండలి సభ్యులు ఘనంగా సత్కరించారు.

తిరిగి ప్రారంభం అయిన కార్యక్రమాలలో డ్రం బీట్స్, ‘అందమైన జీవితం’ సినిమా నృత్యాల మెడ్లీ, స్వరమంజరి విజేతల గాన ప్రదర్శన , “లీలా కృష్ణ”, “వాన జల్లు” సినిమా నృత్యాల మెడ్లీ, “భారతీయం” శాస్త్రీయ నృత్యం కార్యక్రమాలు హుషారుగా సాగి చక్కని ముగింపుకు చేరుకొన్నాయి.

ఈ సంక్రాంతి సంబరాలకి ప్రత్యేకంగా విచ్చేసి అందరిని ఎంతో ఆనందపరచిన ముఖ్య అతిథులు మిమిక్రీ రమేష్ ను, RJ ప్రణవిని జ్ఞాపిక, దుశ్శాలువ, సన్మాన పత్ర పుష్పగుచ్చాలతో సన్మానం చేయడం జరిగింది.


Click here for Event Gallery

 

Tags :