ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

శాక్రమెంటో తెలుగింటి వాకిట్లో బ్రహ్మాండంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

శాక్రమెంటో తెలుగింటి వాకిట్లో బ్రహ్మాండంగా జరిగిన సంక్రాంతి సంబరాలు

కాలిఫోర్నియా రాష్ట్రం లో ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం 12 వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భం గా సిలికానాంధ్ర వారి సహకారం తో రూపొందించిన పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర” ఆహుతులను విశేషం గా ఆకట్టుకొన్నది. హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు, ఎద్దులబండి, పల్లె సెట్టింగ్, మరియు జానపద కళాకారులు చేసిన సందడితో సంక్రాంతి వేడుకల ప్రాంగణం లో ఆహ్లాదకరమైన వాతావరణం నెలకొంది. స్థానిక ఫోల్సోం నగరం లో ఉన్న ఫాల్సం హై స్కూల్ ధియేటర్ లో శనివారం జనవరి 30 వ తేది 2016 మధ్యాన్నం 12 గంటలకు మొదలైన సంక్రాంతి సంబరాలు రాత్రి 11 గం వరకు కొనసాగాయి.

శాక్రమెంటో తెలుగు సంఘం సంక్రాంతి సంబరాల లో ప్రదర్శించిన ముఖ్యాంశాలు:

1.    శాక్రమెంటో లో పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర”.
2.    జానపద రూపకం లో “ప్రత్యక్ష గానం, మరియు డప్పు తో” అలరించిన జానపద కళా ప్రపూర్ణ “డా. లింగా శ్రీనివాస్“
3.    జానపద గీతాలతో, నృత్యాలతో ఆకట్టుకున్న నిరుపమ చేబియం బృందం
4.    జానపద నృత్య రూపకర్త స్నేహ వేదుల రూపొందించిన బోనాలు, లంబాడి నృత్యాలు
5.    సిద్ధార్థ్ మార్గదర్శకత్వం లో మానస రావు బృందం చే అల్ట్రా వయోలేంట్ సాంస్కృతిక ప్రదర్శన
6.    గ్రామీణ మరియు గిరిజన నృత్య రూపాలైన లంబాడి, కోయ, కోలాటం, చెక్కభజన, హరిదాసులు, గంగిరెద్దులు, రంగవల్లులు తో కలిపిన జానపద నృత్యాలతో, పాటలతో సందడి చేసిన 50 మందికి పైగా స్థానిక కళాకారులు.
7.    డోలక్ తో ఉర్రూతలూగించిన”బాలాజీ”, కీబోర్డ్ వాద్య సంగీతం తో ఆకట్టుకొన్న “సందీప్ మాండలిక”.
8.    వేదిక పై వివిధ ఇతర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆకట్టుకున్న300 మందికి పైగా స్థానిక కళాకారులు.
9.    భోజన విరామ సమయం లో 1000 మందికి పైగా ఆహుతులను లలిత సంగీతం, సినీ గీతాలతో ఆకట్టుకున్న చిన్నారులు, పెద్దలు.

సంక్రాంతి వేడుకల సందర్భం గా TAGS అధర్వంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు, పూర్తి నిడివి జానపద రూపకం “మన జానపద జాతర”, వేదిక పై ఉన్న 300 మందికి పైగా స్థానిక కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు,స్థానిక రుచి రెస్టారెంట్ వారు వండిన నొరూరుంచే పసందైన తెలుగు వంటకాలు, మరి ఇంకెన్నో విశేషాలతో ఆహుతులను అలరించాయి. కదలి రండి, కలసి రండి, సంక్రాంతి సంబరాన్ని ఉమ్మడిగా జరుపుకొందాము అని TAGS ఇచ్చిన పిలుపుకు స్పందించిన స్థానిక తెలుగు కుటుంబాలు 1000 మందికి పైగా వేదిక కు తరలి వచ్చారు. ఈ సందర్భం గా అవంతీ కల్యాణం, మేఘ నవలా రచయిత్రి, దేవులపల్లి కృష్ణ శాస్త్రి మనవరాలు శ్రీమతి లలిత రామ్ ముఖ్య అతిధి గా విచ్చేసి ఆహుతులకు సంక్రాంతి సందేశాన్ని అందజేశారు. మనదైన తెలుగు సంస్కృతి, కవిత్వం, సాహిత్యం, సంప్రదాయాలను తరువాతి తరం వారికి అందజేయాలని వారు నొక్కి చెప్పారు.

టాగ్స్ తరపున చైర్మన్ రాంబాబు బావిరిసెట్టి, అధ్యక్షులు వెంకట్ నాగం, మరియు కార్యవర్గం సభ్యులు శ్రీమతి లలిత రామ్ గారికి వేదిక పై ఘనం గా సన్మానం గావించి జ్ఞాపిక ను అందజేశారు. ప్రియమైన అతిధి గా విచ్చేసిన స్క్రీన్ ప్లే రైటర్, నిర్మాత, సంభాషణ రచయిత, దర్శకుడు, శ్రీ కోన వెంకట్ స్థానిక తెలుగు కళాకారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలకు అచ్చెరువొందారు. శాక్రమెంటో తెలుగు సంఘం కార్యవర్గ సభ్యులు శ్రీ కోన వెంకట్ ను వేడుక పై సాదరంగా ఆహ్వానించి కు వేదిక పై ఘనం గా సన్మానం గావించారు. అపజయాలతో క్రుంగిపోకుండా నేను చేసిన నిరంతర ప్రయత్నమే నన్ను ఈస్థాయి కి నిలబెట్టింది అని, ప్రయత్నిస్తే విజయం తధ్యమని శ్రీ కోన వెంకట్ సందేశం ఇచ్చారు.

శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులకు శ్రీ కోన వెంకట్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసారు. మరో ప్రియమైన అతిధి గా విచ్చేసిన సిలికానాంధ్ర వైస్ చైర్మన్ శ్రీ దిలీప్ కొండిపర్తి గారిని TAGS అధక్షులు వెంకట్ నాగం సభికులకు పరిచయం చేసారు. ఈ సందర్భం దిలీప్ కొండిపర్తి గారు మాట్లాడుతూ 2004 లో మొట్టమొదటి సారిగా TAGS శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలను జరిపిందని, ఇప్పుడు వరుసగా 12వ సారి సంక్రాంతి సంబరాలను జరుపుకోవడం ఆనందంగా ఉందని, ఈ రెండు వేడుకల్లో కుడా సిలికానాంధ్ర బృందం TAGS వారి సంక్రాంతి సంబరాల సాంస్కృతిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం మరింత ఆనందం గా ఉందని, మనదైన సంస్కృతి, సంప్రదాయాన్ని పిల్లలకు అందించడానికి ఇటువంటి వేడుకలు అవసరం అని నొక్కి చెప్పారు. తెలుగు వారి కూచిపూడి నాట్యానికి పుట్టినిల్లు అయినటువంటి కూచిపూడి గ్రామం దీనావస్థ లో ఉందని, దీనికి మెరుగుపరచడానికి జయహో కూచిపూడి కార్యక్రమానికి, స్థానిక మనబడి కి చేయుతనివ్వాలని శ్రీ దిలీప్ కొండిపర్తి నొక్కి చెప్పారు.

ఈ సందర్భం గా TAGS రూపొందించిన 5వ సమాచార పత్రిక ను శ్రీమతి లలిత రామ్, శ్రీ కోన వెంకట్, స్థానిక తెలుగు ప్రముఖులు శ్రీ శివాజీ వల్లూరుపల్లి గారు ఆవిష్కరించారు. TAGS సౌజన్యం తో జరుగుతున్న సిలికానాంధ్ర మనబడి కి మూడు ఏండ్లగా ఉపాధ్యాయులుగా ఉండి శాక్రమెంటో లో తెలుగు భాషా వ్యాప్తి కి కృషి చేస్తున్న శ్రీ ప్రసాద్ పన్నాల, శ్రీమతి విజయలక్ష్మి పన్నాల గార్లు శాక్రమెంటో లో జరుగుతున్న స్థానిక మనబడి పిల్లలతో చక్కని తెలుగు పద్యాలు, కధలు, పాటలు పాడించారు. ఈసందర్భం గా ప్రతిభావంతులైన పిల్లలను పోత్సహించే గత సంప్రదాయాన్ని పాటిస్తూ, టాగ్స్ కార్యవర్గ సభ్యులు స్థానిక ప్రతిభావంతులైన పిల్లలు సుకీర్త్ మందడి, తేజ స్నర్ర, విజయ్ రావి లకు జ్ఞాపికలు అందజేశారు. బోర్డు సభ్యులు మోహన్ కాట్రగడ్డ వందన సమర్పణ గావించారు. జగిత్యాల నుండి TAGS సంక్రాంతి సంబరాలకు ప్రత్యేకంగా విచ్చేసిన డా. లింగా శ్రీనివాస్ డప్పు తో, జానపద పాటలతో, స్థానిక కళాకారులతో చేసిన నృత్యాలతో వేదిక దద్దరిల్లింది.

ఈ సందర్భం గా TAGS తరపున అధ్యక్షులు వెంకట్ నాగం డా. లింగా శ్రీనివాస్ కు జ్ఞాపిక ను ప్రదానం చేసారు. శాక్రమెంటో తెలుగు సంఘం సభ్యులను ఉద్దేశించి ప్రసంగించిన ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి గౌ. కె .ఈ. కృష్ణ మూర్తి గారి వీడియో, మరియు తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ గౌ. శ్రీ మామిడి హరికృష్ణ గారి సంక్రాంతి అభినందనల వీడియో ను వేదిక పై ప్రదర్శించారు. కాలిఫోర్నియా శాక్రమెంటో లో సంక్రాంతి సంబరాలు విజయవంతం కావడానికి అహర్నిశలు కృషి చేసిన వారిలో టీఏజిఎస్ కార్యవర్గ సభ్యులు మనోహర్ మందడి, శ్రీదేవి మాగంటి, రాజా రామ్ ముమ్మడవరపు, వనిత ఆలపాటి, మోహన్ కాట్రగడ్డ, దుర్గా చింతల, స్వర్ణ కంభంపాటి,అశ్విన్ తిరునాహరి, గిరి టాటిపిగారి, సుధాకర్ వట్టి, రాంబాబు బావిరిసెట్టి, మల్లిక్ సజ్జనగాండ్ల, గిరిధర్ టాటిపిగారి, కీర్తి సురం, వాసు కుడుపూడి, భాస్కర్ దాచేపల్లి, వెంకట్ నాగం, TAGS కార్యకర్తలు తదితరులు పాల్గోన్నారు.

ఈ సందర్భం గా TAGS కార్యనిర్వాహక సభ్యులు వికలాంగుల సహాయార్ధం తిరుపతి లో ఉన్న అభయ క్షేత్రం అనే సంస్థ కు, అనాధ భారతీయ బాలబాలికలకు సహాయార్ధం హోప్ ఎబయ్డ్స్, వేగేశ్న ఫౌండేషన్ హైదరాబాద్, మరియు నా ఇటుక – నా అమరావతి కి TAGS ప్రత్యేకం గా విరాళాలు అందజేస్తుంది అని, ఈ సంస్థలకు సహాయార్ధం విరాళం ఇవ్వదలచిన వారు మరింత సమాచారం కోసం sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు. సంక్రాంతి సంబరాల ఫోటోలను ఫేస్ బుక్ https://www.facebook.com/SacTelugu/photos_stream లో చూడవచ్చు. TAGS చేపట్టబోయే కార్యక్రమాలకు సంబంధించి మరిన్ని వివరాలను తెలుసుకోవాలనుకునేవారు http://www.sactelugu.org , https://www.facebook.com/SacTelugu ను సందర్శించాలని లేదా sactags@gmail.com కు ఈమెయిలు లో సంప్రదించాలని TAGS కార్యనిర్వాహక సభ్యులు కోరారు.


Click here for Event Gallery

 

Tags :