ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం

2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు  శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం

రామానుజ విగ్రహావిష్కరణకు ప్రముఖుల రాక

హైదారాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్య సాకేతంలో 2022 ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరగబోయే శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల సంరంభం.. లోక కల్యాణదాయకం!   భగవద్రామానుజుల సిద్ధాంతమంటే మానవతా సందేశమే! విశిష్టాద్వైత విశ్వరూపమే! అందుకే ఆ మహనీయుని విగ్రహావిష్కరణ ఘట్టానికి అతిరథ మహారథులు విచ్చేయనున్నారు. ఇప్పటికే రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణలను చిన్న జీయర్‌ స్వామి స్వయంగా కలిసి.. ఈ మహోత్సవాలకు రావాలంటూ ఆత్మీయ ఆహ్వానం పలికారు. అలాగే రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్‌రెడ్డి, కేంద్ర మంత్రులు నితిన్‌ గడ్కరీ, అశ్విని కుమార్‌ చౌబే, శోభా కరంద్లాజే, భూపిందర్‌ యాదవ్‌తోబాటు ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భగవత్‌లను కూడా కలిసి.. శ్రీ రామానుజాచార్యుల మహా విగ్రహావిష్కరణకు రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానించారు. స్వామీజీ ఆహ్వానాన్ని వినయపూర్వకంగా అందుకున్నారు నేతలు! చిన్నజీయర్‌స్వామిని కలవడం పూర్వజన్మ సుకృతమని  అమిత్‌ షా ట్వీట్‌ చేశారు.

శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకల్లో భాగంగా సహస్ర కుండాత్మక లక్ష్మీనారాయణ యాగం నిర్వహించనున్నారు. 1035 హోమగుండాలతో ప్రత్యేక యాగం చేస్తారు. ఇందుకోసం 2 లక్షల కిలోల ఆవునెయ్యితోబాటు ఇతర హోమ ద్రవ్యాలు వినియోగించనున్నారు.  భగవద్రామానుజుల మహా విగ్రహావిష్కరణతోబాటు.. 108 దివ్య దేశాలు భక్తులను అనుగ్రహిస్తాయి. 200 ఎకరాల్లో 1000 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన 216 అడుగుల భగవద్రామానుజుల పంచలోక మహా విగ్రహావిష్కరణ భారతజాతి చరిత్రలో ఓ సువర్ణాక్షర ఘట్టంగా నిలవనుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సమతా స్ఫూర్తిని చాటుతూ నిర్వహించనున్న రామనుజ సహస్రాబ్ది సంరంభం ప్రపంచ దృష్టిని ఇప్పటికే ఆకర్షిస్తోంది.

ఫిబ్రవరి 2 నుంచి  ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’ 

సమతామూర్తి భగవద్రామానుజాచార్యులు అవతరించి వెయ్యేండ్లయిన సందర్భంగా  ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు ‘శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహం’ పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు త్రిదండి చినజీయర్‌స్వామి వెల్లడిరచారు. రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లోని శ్రీరామనగరం ఆశ్రమంలో నిర్వహించే ఉత్సవాలకు రాష్ట్రపతి, ప్రధానితోపాటు ఉప రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులు, గవర్నర్లు, ముఖ్యమంత్రులు దేశ, విదేశీ ప్రముఖులు హాజరవుతారని చెప్పారు.  మైంహోం గ్రూప్‌ అధినేత జూపల్లి రామేశ్వర్‌రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 5న రామానుజాచార్యుల భారీ పంచలోహ విగ్రహాన్ని (సమతావిగ్రహం) ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆవిష్కరించనున్న ట్టు చెప్పారు. 216 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం ప్రపంచ అద్భుతంగా నిలుస్తుందని అన్నారు. వంద ఎకరాల విస్తీర్ణంలో రూ.1,200 కోట్లు వెచ్చించి అంతర్జాతీయ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. కుల, మతాల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు ఏర్పడుతున్న ప్రస్తుత తరుణంలో రామానుజుడి బోధనలు సమాజానికి అవసరమని, సమాజంలో శాంతిని నెలకొల్పాలనే సంకల్పంతోనే సహస్రాబ్ధి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఉత్సవాలలో భాగంగా 12 రోజుల పాటు 128 యాగశాలల్లో ఐదువేల మంది రుత్విక్కులు నాలుగు వేదాలు పారాయణం చేస్తారని తెలిపారు. హోమం, కోటిసార్లు నారాయణ జపం, కోటి హవన మహాక్రతువు, గోపూజలు నిర్వహిస్తామని వివరించారు. హోమంలో వినియోగించేందుకు వివిధ రాష్ట్రాల నుంచి రెండు లక్షల కిలోల దేశీ ఆవునెయ్యిని సేకరిస్తున్నామని వివరించారు. ఫిబ్రవరి 14న నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ హాజరవుతారని చెప్పారు. డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావు మాట్లాడుతూ.. సమతామూర్తి విగ్ర హం ఆవిష్కరించడాన్ని పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో అహోబిల జీయర్‌స్వామి, దేవనాధ జీయర్‌స్వామి, ఎన్నారై సంస్థల నిర్వాహకుడు ముక్కాముల అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

స్వర్ణశోభిత రామానుజుల విగ్రహం

శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరంలో కొలువుదీరిన 216 అడుగుల పంచలోహ రామానుజాచార్యుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ఆవిష్కరించనున్నారు. పంచలోహాలతో ప్రతిష్టించిన స్వర్ణశోభిత రామానుజుల విగ్రహాన్ని సమతామూర్తి (స్టాట్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా) పేర్కొంటున్నారు. ప్రపంచంలోనే రెండో ఎత్తయిన విగ్రహంగా ఇది పేరు పొందింది. ఈ ప్రాంతాన్ని దాదాపు రూ.1200 కోట్లతో అభివృద్ధి చేస్తున్నారు. విగ్రహ నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. చుట్టూ ఉన్న ఆలయాలు నిర్మాణంలో ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా పనులు కొంత ఆలస్యమయ్యాయి. విగ్రహం చుట్టూ 108 దివ్యక్షేత్రాల నమూనా ఆలయాలను కృష్ణ శిలలతో నిర్మిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 108 దివ్య క్షేత్రాలలోని దేవతామూర్తులు వీటిలో కొలువు దీరనున్నారు. మొత్తం మూడు అంచెల్లో ఉంటుంది. రామానుజాచార్యులు కూర్చుని ఉన్న రూపంలో సాక్షాత్కరిస్తారు.  ఈ క్షేత్రాన్ని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి  ఏటా వేలమంది భక్తులు వచ్చే వీలుంది. ఆధునిక సాంకేతికత సాయంతో వివిధ భాషల్లో క్షేత్ర ప్రాశస్త్యాన్ని తెలుసుకునేలా ఏర్పాట్లు చేస్తున్నారు. క్షేత్ర పరిసరాల్లో సందర్శకులు సైల్ఫ్‌ గైడెడ్‌ టూల్‌ సాయంతో ప్రత్యేక ఇయర్‌ఫోన్లు ఉపయోగించి తమకు నచ్చిన భాషలో ఈ క్షేత్రం గురించి తెలుసుకోవచ్చు.

రామానుజ విగ్రహావిష్కరణకు ప్రముఖులకు ఆహ్వానం

శ్రీరామానుజ విగ్రహావిష్కరణకు మై హోం చైర్మన్‌ డాక్టర్‌ జూపల్లి రామేశ్వరరావుతో కలసి చినజియ్యర్‌ స్వామి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర కేంద్ర మంత్రులను స్వయంగా కలసి ఆహ్వాన పత్రికలను ఆందించారు.

 

Tags :