ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

పైలట్ ప్రాజెక్టుకు 'ఫస్ట్ అమెరికన్' సిద్ధం

పైలట్ ప్రాజెక్టుకు 'ఫస్ట్ అమెరికన్' సిద్ధం

అమెరికాలో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీశాఖ మంత్రి నారా లోకేష్‌ వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతనివ్వాల్సిందిగా కోరుతున్నారు.

రాష్ట్రంలోని ఫైబర్‌గ్రిడ్‌ ప్రాజెక్టును ఉపయోగించుకుని కొన్ని గ్రామాల్లో 'వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌' పైలట్‌ ప్రాజెక్టును అమలుచేసేందుకు ముందుకురావాల్సిందిగా 'ఫస్ట్‌ అమెరికన్‌' కంపెనీని నారా లోకేష్‌ కోరారు. అందుకు ఆ కంపెనీ కూడా అంగీకారాన్ని తెలియజేసింది. శాన్‌ఫ్రాన్సిస్కోలో ఫస్ట్‌ అమెరికన్‌ కంపెనీ సీఈవో డెన్నిస్ జే. గిల్మోర్, ఎగ్జిక్యూటివ్‌ ఉపాధ్యక్షుడు మార్క్‌లతో సమావేశమయ్యారు. టైటిల్‌, బీమా సర్వీసులు, మోర్టగేజ్‌ హోమ్‌ వారంటీ సర్వీసులను ఈ కంపెనీ అందిస్తోంది. తమ రాష్ట్రంలో భూ రికార్డులన్నీ డిజిటలైజ్‌ చేస్తున్నామని, ట్యాంపరింగ్‌ చేసే అవకాశం లేకుండా ల్యాండ్‌ రికార్డులు అన్నీ బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ వేదికపైకి తీసుకొస్తున్నామని లోకేశ్‌ వివరించారు. దీనివల్ల రైతులు తక్కువ సమయంలో టైటిల్‌ ఇన్సూరెన్స్‌, రుణాలు పొందే వీలు కలిగిందన్నారు. ఫైబర్‌గ్రిడ్‌ సేవల గురించీ చెప్పారు.

ఫస్ట్‌ అమెరికన్‌ కంపెనీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి ల్యాండ్‌ రికార్డులను డిజిటలైజ్‌ చేసే పైలట్‌ ప్రాజెక్ట్‌ను చేస్తోందని, దీనిలో మంచి ఫలితాలు వస్తున్నాయన్నారు. ఫైబర్‌గ్రిడ్‌ను ఉపయోగించుకుని గ్రామాల్లో యువతీ, యువకులు వారి ఇంటి నుంచే పని చేసుకునేలా ఒక మోడల్‌ పైలట్‌ ప్రాజెక్టు చేయాలని కోరారు. ఇందుకు ఆ కంపెనీ సీఈవో అంగీకరించారు. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌కు వస్తామని, అక్కడ జరుగుతున్న అభివద్ధిని స్వయంగా చూస్తామన్నారు.

కోవలెంట్‌ వెంచర్స్‌ సీఈవో రాం యలమంచిలి, జనరల్‌ క్యాటలిస్ట్‌ కంపెనీ ఎండీ హేమంత్‌ తనేజాలతోనూ లోకేశ్‌ చర్చించారు. ఆయన విజ్ఞప్తి మేరకు ఏపీతో కలిసి పని చేసేందుకు వారు సముఖత వ్యక్తం చేశారు. స్టాన్‌ఫోర్డ్‌ బిజినెస్‌ స్కూల్‌ డీన్‌ జొనాతన్‌ లెవిన్‌తోనూ లోకేశ్‌ భేటీ అయ్యారు.

 

Tags :