ASBL NSL Infratech Sattva Lakeridge Radha Spaces

ఎన్నికల కమిటీ తీరు సరికాదు...భక్తబల్లా

ఎన్నికల కమిటీ తీరు సరికాదు...భక్తబల్లా

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) ఎన్నికల్లో నరేన్‌ వర్గం తరపున కార్యదర్శి పదవికి నామినేషన్‌ వేసిన భక్తబల్లా నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు తానా ఎన్నికల కమిటీ ప్రకటించడంపై నరేన్‌ వర్గం నాయకులు ఇది అన్యాయమని పేర్కొంటున్నారు. తానా ఫౌండేషన్‌ ట్రస్టీగా భక్తబల్లా పదవీకాలం 2023 వరకు ఉంది. నరేన్‌ కొడాలి ప్యానెల్‌ తరపున కార్యదర్శి పదవికి ఆయన నామినేషన్‌ వేశారు. కాని ఆయన రాజీనామా సరైన సమయంలో అందలేదని ఎన్నికల కమిటీ ప్రకటించింది. దాంతో ఆయన నామినేషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. దీనిపై భక్తబల్లా స్పందిస్తూ తానా బైలాస్‌ ప్రకారం తాను సక్రమంగానే వ్యవహరించానని, అయినా ఎన్నికల కమిటీ తన నామినేషన్‌ను తిరస్కరించడం దారుణమని అన్నారు. ఎన్నికల కమిటీ చిత్తశుద్ధిని తాను ప్రశ్నిస్తున్నానని, ఈ విషయంలో తన హక్కులకు భంగం కలిగిందని, తనకు న్యాయం జరిగేలా చూడాలంటూ ఆయన బోర్డుకు లేఖ రాశారు. 

ఈ విషయమై తాను ఎన్నికల కమిటీకి వినతులు చేసినప్పటికీ నాకు న్యాయం జరగలేదంటూ ఈ విషయంలో అవసరమైతే తాను న్యాయపరమైన పోరాటం కూడా చేస్తానని చెబుతున్నారు. తానా కార్యదర్శి పదవికి నేను 13వ తేదీన నామినేషన్‌ వేశాను. నా రాజీనామా లేఖ అందినట్లు మీ కార్యాలయం నుంచి ఫిబ్రవరి 14వ తేదీన సమాచారం వచ్చింది. ఇదే సందర్భంలో కొన్ని విషయాలను మీ ముందుకు తేవాలన్న ఉద్దేశ్యంతో ఈ లేఖను రాస్తున్నాను.

తానా బైలాస్‌ ఉపచట్టం ప్రకారం ధర్మకర్త, డైరెక్టర్‌, లేదా ఎగ్జిక్యూటివ్‌ కమిటీ లేదా ఫౌండేషన్‌ సభ్యుడు  ఇతర పదవులకు నామినేషన్‌ వేసేముందు రాజీనామా చేస్తారని పేర్కొని ఉంది. దాని ప్రకారం నేను ఫిబ్రవరి 14వ తేదీ నాటికి రాజీనామా చేశాను. నా రాజీనామాను ఫిబ్రవరి 21న అంగీకరించినట్లు తెలిపారు. అయితే 25వ తేదీ వరకు సెక్రటరీ పదవికి వేసిన నా నామినేషన్‌ అంగీకరించబడలేదు. ఉపచట్టం ప్రకారం తన నామినేషన్‌ను తిరస్కరించడానికి వీల్లేదు. నిబంధనలకు అనుగుణంగానే నేను వ్యవహరించాను. ఈ విషయంలో నాకు న్యాయం చేస్తారని నేను ఆశిస్తున్నానని, తనకు పోటీ చేసే అవకాశం కల్పిస్తారని భావిస్తున్నట్లు భక్తబల్లా బోర్డుకు రాసిన లేఖలో పేర్కొన్నారు.

 

Tags :