MK Stalin: స్టాలిన్ సంచలన నిర్ణయం: రాష్ట్ర స్వయంప్రతిపత్తి కోసం కమిటీ ఏర్పాటు

తమిళనాడు ముఖ్యమంత్రి, డీఎంకే(DMK) అధ్యక్షుడు ఎం.కే.స్టాలిన్ (MK Stalin) రాష్ట్ర స్వయంప్రతిపత్తి, కేంద్ర-రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేసే దిశగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందుకోసం ఒక హైలెవల్ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు శాసనసభలో స్టాలిన్ ప్రకటించారు. ఈ కమిటీ కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, రాష్ట్ర స్వయంప్రతిపత్తి, సమాఖ్య స్ఫూర్తిని బలోపేతం చేసేందుకు సిఫారసులు చేస్తుందన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్ (Justice Kurian Joseph) నేతృత్వంలోని ఈ కమిటీలో మాజీ ఐఎఎస్ అధికారి అశోక్ వర్ధన్ శెట్టి, మాజీ స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఉపాధ్యక్షుడు ఎం. నాగనాథన్ సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ 2026 జనవరిలో తాత్కాలిక నివేదికను, 2028లో తుది నివేదికను సమర్పించనుంది.
తమిళనాడు స్వయంప్రతిపత్తిని కాపాడటమే కాకుండా, భారతదేశంలోని సమాఖ్య వ్యవస్థను బలోపేతం చేయడానికి ఇదొక ముఖ్యమైన అడుగు అని స్టాలిన్ వెల్లడించారు. డీఎంకే నాయకత్వంలోని తమిళనాడు ప్రభుత్వం (Tamilnadu Govt) ఎన్డీయే (NDA)నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తోందని ఆరోపిస్తోంది. ముఖ్యంగా, నీట్ (NEET), నూతన విద్యా విధానం (NEP), జీఎస్టీ (GST), రాష్ట్ర జాబితాలోని అంశాలను ఉమ్మడి జాబితాకు మార్చడం వంటి విషయాల్లో కేంద్రం రాష్ట్ర హక్కులను కాలరాస్తోందని స్టాలిన్ విమర్శించారు.
తమిళనాడు ఆర్థికంగా దేశంలో రెండో స్థానంలో ఉంది. కేంద్రానికి ఒక రూపాయి చెల్లిస్తే కేవలం 29 పైసలు మాత్రమే తిరిగి వస్తున్నాయని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. జీఎస్టీ అమలు తమిళనాడు వంటి తయారీ కేంద్రాలకు ఆదాయ నష్టాన్ని కలిగించిందని, రాష్ట్రాల ఆర్థిక స్వయంప్రతిపత్తిని దెబ్బతీసిందని ఆయన ఆరోపించారు. అలాగే, విద్యా రంగాన్ని రాష్ట్ర జాబితాకు తిరిగి తీసుకురావాలని ఈ కమిటీ సిఫారసు చేయాలని స్టాలిన్ సూచించారు. 1969లో డీఎంకే నాయకుడు కరుణానిధి (Karunanidhi) రాజమన్నార్ కమిటీని (Rajamannar Committee) ఏర్పాటు చేసిన సందర్భాన్ని గుర్తుచేస్తూ, ఆ కమిటీ సిఫారసులను కేంద్రం పట్టించుకోలేదని, ఇప్పుడు మళ్లీ ఈ విషయంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని స్టాలిన్ అన్నారు.
స్టాలిన్ ఈ కమిటీ ఏర్పాటు చేయడం వెనుక రాజకీయ, ఆర్థిక, సామాజిక కోణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తమిళనాడు గతంలో నీట్ రద్దు కోసం శాసనసభలో తీర్మానం చేసినప్పటికీ, రాష్ట్రపతి ఆమోదించలేదు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అలాగే, గవర్నర్ ఆర్.ఎన్.రవి (R.N.Ravi) శాసనసభ ఆమోదించిన బిల్లులకు అనుమతి నిరాకరించడం, రాష్ట్రపతికి పంపడం వంటి చర్యలపై సుప్రీం కోర్టు ఇటీవల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు రాష్ట్ర శాసనసభల హక్కులను బలపరిచింది. ఇది స్టాలిన్ ప్రభుత్వానికి ఒక విజయంగా చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో కమిటీ ఏర్పాటు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని మరింత బలోపేతం చేసే దిశగా ఒక అడుగుగా కనిపిస్తోంది.
ఎన్డీయే ప్రభుత్వంపై DMK చేస్తున్న ఆరోపణలు కూడా ఈ కమిటీ ఏర్పాటుకు ఒక కారణంగా చెప్పవచ్చు. కేంద్రం రాష్ట్రాల హక్కులను క్రమంగా కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థను బలహీనపరుస్తోందని స్టాలిన్ విమర్శించారు. ఉదాహరణకు, డీలిమిటేషన్ ప్రక్రియలో తమిళనాడు వంటి జనాభా నియంత్రణలో విజయం సాధించిన రాష్ట్రాలు నష్టపోతాయని, ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమస్యను ఎదుర్కొనేందుకు స్టాలిన్ ఇప్పటికే జాయింట్ యాక్షన్ కమిటీ (JAC)ని ఏర్పాటు చేసి, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశమైన సంగతి తెలిసిందే.
2026లో జరగనున్న తమిళనాడు శాసనసభ ఎన్నికలకు ముందు కమటీ ఏర్పాటు డీఎంకే రాజకీయ వ్యూహంగా భావించవచ్చు. రాష్ట్ర స్వయంప్రతిపత్తి, తమిళ గుర్తింపు, సమాఖ్య స్ఫూర్తి వంటి అంశాలను ప్రజల ముందుకు తీసుకెళ్లడం ద్వారా డీఎంకే తమ ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవాలని భావిస్తోంది. అలాగే, బీజేపీ, ఏఐఏడీఎంకే వంటి ప్రతిపక్షాలతో రాజకీయంగా తలపడేందుకు ఈ కమిటీ నివేదిక ఒక ఆయుధంగా ఉపయోగపడవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తంగా, స్టాలిన్ ఈ కమిటీ ఏర్పాటు ద్వారా తమిళనాడు రాష్ట్ర స్వయంప్రతిపత్తిని కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళనాడు రాజకీయ చరిత్రలో ఈ నిర్ణయం ఒక ముఖ్యమైన అధ్యాయంగా నిలిచే అవకాశం ఉంది.