SIR: పారదర్శక ఎన్నికలకు ఇది తొలి మెట్టు
                                    దేశంలోని 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ఇవాల్టి నుంచి ప్రారంభం కాబోతోంది. బీహార్‌లో ఈ ప్రక్రియ తీవ్ర వివాదాలకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఈ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా పలు రాజకీయ పార్టీలు తమ అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నాయి. అయితే పారదర్శకమైన ఓటరు జాబితా కోసం ఈ ప్రక్రియ తప్పనిసరి అని భారత ఎన్నికల సంఘం (ECI) గట్టిగా వాదిస్తోంది.
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) అనేది భారత ఎన్నికల సంఘం (ECI) నిర్వహించే ఒక సమగ్ర, ఇంటింటి తనిఖీ కార్యక్రమం. ఓటరు జాబితా ఖచ్చితంగా, తప్పులు లేకుండా ఉండేలా చూసేందుకు ఈ ప్రక్రియను చేపడతారు. సాధారణంగా ఏటా స్పెషల్ సమ్మరీ రివిజన్ (SSR) జరుగుతుంది. అందులో కొత్త ఓటర్లను చేర్చడం, చనిపోయిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పు వంటివి చేస్తారు. అయితే SIR అనేది దానికంటే చాలా విస్తృతమైనది.
SIR ప్రక్రియలో ముఖ్యంగా ఇంటింటి తనిఖీ చేపడతారు. బూత్ లెవెల్ ఆఫీసర్లు (BLOs) ప్రతి ఇంటినీ సందర్శించి, ప్రతి ఓటరుకు సంబంధించిన వివరాలను సేకరించి, ధృవీకరిస్తారు. ఓటరు జాబితాలో తమ పేరు కొనసాగాలంటే, ప్రస్తుతం ఉన్న ప్రతి ఓటరూ కొత్త ఎన్యూమరేషన్ ఫారాన్ని నింపి, BLOలకు సమర్పించాలి. ఈ ప్రక్రియలో ప్రతి ఓటరు పేరును ఆ రాష్ట్రంలో గతంలో జరిగిన చివరి ఇంటెన్సివ్ రివిజన్ నాటి ఓటరు జాబితాతో లింక్ చేయాల్సి ఉంటుంది. పాత జాబితాలతో తమ పేరు లేదా తల్లిదండ్రులు/బంధువుల పేరు లింక్ కాని పక్షంలో, తమ పౌరసత్వాన్ని, వయస్సును, నివాసాన్ని నిరూపించుకోవడానికి ఓటర్లు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. నకిలీ, డూప్లికేట్ ఎంట్రీలను, మరణించిన వారి పేర్లను తొలగించడం, అర్హులైన పౌరులెవరినీ జాబితా నుంచి మినహాయించకుండా చూడటం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం.
తమిళనాడు వంటి రాష్ట్రాలలో అధికారంలో ఉన్న DMK లాంటి పార్టీలు SIR పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. బీహార్‌లో జరిగిన SIRలో సుమారు 68 లక్షలకు పైగా పేర్లను తొలగించారు. ఈ నేపథ్యంలో, సరైన పత్రాలు చూపించలేని పేద, అల్పాదాయ, వృద్ధ ఓటర్లను జాబితా నుంచి తొలగించే అవకాశం ఉందని, తద్వారా లక్షలాది మంది ఓటు హక్కు కోల్పోతారని ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. పాత SIR రోల్స్‌లో పేరు లేని ఓటర్లు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి కఠినమైన పత్రాలను సమర్పించాలనే కొత్త నిబంధనలపై వ్యతిరేకత ఉంది. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలలో, కేవలం కొన్ని నెలల ముందు ఇంత పెద్ద ఎత్తున రివిజన్ చేపట్టడం వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నాయి. ఇది సైలెంట్ ఇన్విజిబుల్ రిగ్గింగ్ అని తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు విమర్శిస్తున్నాయి. డీఎంకే పార్టీ ఈ SIR ప్రక్రియ రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.
అయితే వివాదాలు, అభ్యంతరాలు ఉన్నప్పటికీ, ఎన్నికల సంఘం తన వైఖరిని గట్టిగా సమర్థించుకుంటోంది. ఓటరు జాబితాలో ఉన్న లోపాలను తొలగించి, 100శాతం ఖచ్చితమైన జాబితాను తయారు చేయడానికి SIR తప్పనిసరి అని చెప్తోంది. పారదర్శక ఎన్నికలకు ఇది తొలి మెట్టు అని స్పష్టం చేస్తోంది. SIR ప్రక్రియను నిర్వహించడానికి ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1950 సెక్షన్ 21(3), ఆర్టికల్ 324 ECI కి అధికారాన్ని కల్పించాయి. గతంలో కూడా ఇటువంటి రివిజన్లు జరిగాయి. అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తొలగించబోమని ECI హామీ ఇస్తోంది. కేవలం సరైన ఫారాలు సమర్పించని, లేదా అనర్హులైన వారి పేర్లను మాత్రమే చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా తొలగిస్తామని స్పష్టం చేసింది. BLOలు ఇంటింటికి వచ్చి ఫారాలు అందిస్తారని, అవసరమైన వారికి సహాయం చేస్తారని ECI పేర్కొంది. అలాగే, పత్రాల సమర్పణ విషయంలో మార్గదర్శకాలను సులభతరం చేసింది.
మొత్తంగా, SIR ప్రక్రియ ఓటరు జాబితాను శుద్ధి చేయడమనే ECI లక్ష్యానికి, సామాన్య ఓటర్లు హక్కులు కోల్పోతారనే రాజకీయ పార్టీల ఆందోళనకు మధ్య కొనసాగుతున్న పోరాటంగా మారింది. SIR అనంతరం తుది ఓటరు జాబితాను వచ్చే ఏడాది ఫిబ్రవరి 7న ప్రచురిస్తారు. అప్పుడు ఎంతమంది ఓటర్లను తొలగించారు, ఎంతమందిని చేర్చారు.. అనే వివరాలు తెలుస్తాయి.







