Waqf Board: వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరుల స్థానంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీమ్ కోర్టు..

వక్ఫ్ (Waqf) సవరణ చట్టం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీస్తోంది. బుధవారం సుప్రీంకోర్టు (Supreme court) ఈ అంశంపై విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి (Chief Justice of India) జస్టిస్ సంజీవ్ ఖన్నా (Justice Sanjiv Khanna) నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ప్రారంభించింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒక కీలకమైన ప్రశ్నతో నిలదీశారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యులను నియమించాలన్న అంశంపై స్పందించిన కోర్టు, హిందూ ధర్మ ట్రస్టుల్లో ముస్లింలకు అవకాశం ఇస్తారా? అని ప్రశ్నించింది. ఈ ప్రశ్న దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది.
ఎన్డీఏ ప్రభుత్వం (NDA Government) వక్ఫ్ చట్టంలో పలు మార్పులను ప్రతిపాదించింది. ఈ మార్పులను బిల్లుగా రూపొందించి, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ద్వారా చర్చింపజేసింది. ఆ తర్వాత ఈ బిల్లు పార్లమెంట్ రెండు సభల్లో ఆమోదం పొందింది. చివరగా రాష్ట్రపతి ఆమోదం కూడా లభించడంతో ఈ బిల్లు చట్టంగా మారింది. అయితే, ఈ చట్టంలోని కొన్ని అంశాలు వివాదాస్పదంగా మారాయి. దీంతో పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. అన్ని పిటిషన్లను కలిపి బుధవారం విచారణ చేపట్టింది.
వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతర సభ్యుల నియామకం అంశంపై ప్రజల్లో, రాజకీయ రంగంలో ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. టీడీపీ ఈ బిల్లుపై చర్చల సమయంలో నాలుగు మార్పులను సూచించింది. అందులో మూడు మార్పులు జరుగగా, ముస్లిమేతర సభ్యుల నియామకం అంశం మాత్రం మారలేదు. టీడీపీ (TDP) ఇందుకు అభ్యంతరం చెప్పినా కేంద్రం ఆ మార్పు చేయలేదు. ఇప్పుడు అదే అంశం సుప్రీంకోర్టులో ప్రధాన చర్చకు వస్తోంది.
వాస్తవానికి వక్ఫ్ బోర్డులు ముస్లింల మతపరమైన ఆస్తులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేయబడ్డవు. అటువంటి బోర్డుల్లో ముస్లిమేతరులకు చోటు అవసరమా అన్నదే ఇప్పుడు ప్రశ్నగా మారింది. హిందూ ట్రస్టుల్లో (Hindu Religious Trusts) ముస్లింలకు చోటు ఇవ్వకపోతే, అదే సూత్రాన్ని వక్ఫ్ బోర్డులకు ఎందుకు వర్తింపజేయరాదు అన్నదే కోర్టు లేవనెత్తిన అంశం. ఇప్పుడు ఈ ప్రశ్నకు కేంద్రం ఎలా సమాధానం ఇస్తుందో, తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది.