Prashant Kishor: ఎన్నికల వేళ ప్రశాంత్ కిశోర్ సంచలన నిర్ణయం

రాజకీయ వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor).. బీహార్ (Bihar) లో సొంత రాజకీయ పార్టీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో గెలిచి ఎలాగైనా అధికారంలోకి రావాలని ఆయన ప్రయత్నిస్తున్నారు. అయితే జన్ సురాజ్ పార్టీ (Jan Suraj Party) వ్యవస్థాపకుడుగా ఉన్న ప్రశాంత్ కిశోర్, రాబోయే బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్టు ప్రకటించారు. తమ పార్టీ విస్తృత ప్రయోజనాల కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆయన స్పష్టం చేశారు.
బీహార్ ఎన్నికల్లో తాను పోటీ చేయకపోవడానికి ప్రధాన కారణం పార్టీ సంస్థాగత బలోపేతంపై పూర్తి దృష్టి పెట్టడమేనని ప్రశాంత్ కిశోర్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. తా ఎన్నికల్లో పోటీ చేస్తే, అది అవసరమైన సంస్థాగత పనుల నుండి తన దృష్టిని మళ్లిస్తుందన్నారు. పార్టీ విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తాను పోటీ చేయకూడదని పార్టీ నిర్ణయించిందని తెలిపారు. బీహార్‌లో తమ పార్టీని పటిష్టపరచడానికి, క్షేత్రస్థాయిలో పని చేయడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని కిశోర్ భావిస్తున్నారు. ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ ప్రాతినిథ్యం వహిస్తున్న రాఘోపూర్ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేయబోనని, తన స్థానంలో పార్టీ మరొక అభ్యర్థిని ప్రకటించిందని ఆయన పేర్కొన్నారు. గతంలో, రాఘోపూర్ నుంచి ప్రశాంత్ కిశోర్ పోటీ చేస్తారనే ఊహాగానాలు వినిపించాయి.
ప్రశాంత్ కిశోర్ ఎన్నికల్లో పోటీ చేయనప్పటికీ, తమ జన్ సురాజ్ పార్టీ విజయంపై ఆయన గట్టి ధీమా వ్యక్తం చేశారు. బీహార్‌లో 150 సీట్ల కంటే తక్కువ వస్తే దానిని తమ ఓటమిగా పరిగణిస్తామని ఆయన వ్యాఖ్యానించడం విశేషం. మా పార్టీకి 10 కంటే తక్కువ సీట్లు లేదంటే 150 కంటే ఎక్కువ సీట్లు వస్తాయని ప్రశాంత్ కిశోర్ ప్రకటించారు. మధ్యలో ఉండటానికి అవకాశం లేదని స్పష్టం చేశారు. ఒకవేళ తమ పార్టీ ఘన విజయం సాధిస్తే, బీహార్‌ను దేశంలోని 10 అత్యంత అభివృద్ధి చెందిన రాష్ట్రాలలో ఒకటిగా మార్చే అవకాశం లభిస్తుందని కిశోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, జన్ సురాజ్ పార్టీ బీహార్ ఎన్నికల్లో గెలిస్తే, అది దేశవ్యాప్తంగా ప్రభావం చూపుతుందన్నారు. జాతీయ రాజకీయాల దిశ కూడా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ప్రశాంత్ కిశోర్ పార్టీ బీహార్‌లో ఏ రాజకీయ కూటమితోనూ పొత్తు పెట్టుకోకుండా 243 స్థానాల్లోనూ ఒంటరిగా పోటీ చేస్తోంది. తమ కూటమి కేవలం బీహార్ ప్రజలతోనేనని ఆయన ప్రకటించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌ను లక్ష్యంగా చేసుకుని విమర్శలు గుప్పించిన కిశోర్, ఈసారి నితీశ్ మళ్లీ ముఖ్యమంత్రి కారని జోస్యం చెప్పారు. అలాగే, ఎన్డీయే కూటమిలో పూర్తిగా గందరగోళం నెలకొందని ఆయన చెప్పారు.
మొత్తం మీద, ప్రశాంత్ కిశోర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకూడదనే జన్ సురాజ్ పార్టీ నిర్ణయం వ్యూహాత్మకమైందిగా కనిపిస్తోంది. ఇది కేవలం ఒక నియోజకవర్గానికి పరిమితం కాకుండా, పార్టీ వ్యవస్థాపకుడిగా రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం, సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించేందుకు ఆయనకు వీలు కల్పిస్తుంది. ఈ నిర్ణయంతో, బీహార్ రాజకీయాల్లో జన్ సురాజ్ పాత్ర, దాని ప్రభావంపై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.