ఉద్యోగులకు ఓలా షాక్…. 200 మందిని
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించింది. టెక్, ఇంజినీరింగ్, ప్రొడక్ట్ టీమ్‌కు చెందిన దాదాపు 200 మంది ఉద్యోగులను తాజాగా ఉద్వాసన పలికింది. ఉద్యోగాలు కోల్పోయిన వారిలో ఓలా క్యాబ్స్, ఓలా ఎలక్ట్రిక్, ఓలా పైనాన్షియల్ సర్వీసెస్ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ఉద్యోగులపై ఎక్కువ ప్రభావం పడినట్లు తెలిసింది. సామర్థ్యాన్ని మెరుగుపరుచుకోవడంలో భాగంగా ఎప్పటికప్పుడు పునర్నిర్మాణ చర్యలు తీసుకుంటున్నామని కంపెనీ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. ఇందులో భాగంగా కొన్ని అవసరం లేని రోల్స్ కూడా ఉన్నట్లు గుర్తించామని పేర్కొన్నారు. ఇంజినీరింగ్, డిజైన్ విభాగాల్లో కొత్తగా ఉద్యోగులను నియమించుకుంటామని తెలిపారు. సీనియర్ టాలెంట్‌ను చేర్చుకోవడం తమ ప్రాధాన్య అంశమని తెలిపారు.






