KP Radhakrishnan: ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కె.పి.రాధాకృష్ణన్..! బీజేపీ వ్యూహాత్మక ఎత్తుగడ..!!
భారతీయ జనతా పార్టీ (BJP) నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (NDA) ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కె.పి.రాధాకృష్ణన్ (KP Radhakrishnan)ను ఎంపిక చేసింది. ఆయన ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నర్ గా ఉన్నారు. ఆయన పూర్తి పేరు చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్. రాధాకృష్ణన్ ను ఎంపిక చేయడం ద్వారా బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించిందని అర్థమవుతోంది. తమిళనాడు రాజకీయాల్లో, దక్షిణ భారత రాష్ట్రాల్లో పార్టీ ప్రభావాన్ని పెంచే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
1957 అక్టోబర్ 20న తమిళనాడులోని తిరుప్పూర్‌లో జన్మించిన కె.పి. రాధాకృష్ణన్, కొంగు వెల్లలర్ గౌండర్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈ సామాజిక వర్గం పశ్చిమ తమిళనాడులోని (Tamilnadu) కొంగు ప్రాంతంలో గణనీయమైన రాజకీయ, ఆర్థిక ప్రభావం కలిగి ఉంది. తూత్తుకుడిలోని వి.ఓ. చిదంబరం కళాశాల నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో బ్యాచిలర్ డిగ్రీ పొందిన రాధాకృష్ణన్, 16 ఏళ్ల వయస్సులోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)లో చేరారు. 1974లో భారతీయ జనసంఘ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1998, 1999 ఎన్నికల్లో కోయంబత్తూరు నుంచి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యారు.
2004-2007 మధ్య తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా రాధాకృష్ణన్ పనిచేశారు. ఈ సమయంలో ఆయన యాత్ర చేపట్టి నదుల అనుసంధానం, ఉగ్రవాద నిర్మూలన, కామన్ సివిల్ కోడ్, అస్పృశ్యత నిర్మూలన వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లారు. 2016-2020 మధ్య కాయిర్ బోర్డు చైర్మన్‌గా పనిచేశారు. ఆ సమయంలో భారత కాయిర్ ఎగుమతులను రూ. 2,532 కోట్లకు చేర్చి రికార్డు సృష్టించారు. 2023లో జార్ఖండ్ గవర్నర్‌గా నియమితులై, తర్వాత తెలంగాణ, పుదుచ్చేరి గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించారు. 2024 జులైలో మహారాష్ట్ర గవర్నర్‌గా నియమితులయ్యారు.
రాధాకృష్ణన్ ఎంపిక వెనుక బీజేపీ వ్యూహాత్మక రాజకీయ లక్ష్యాలు స్పష్టంగా కనిపిస్తాయి. తమిళనాడు రాజకీయాల్లో బీజేపీకి ఇంకా బలమైన పట్టు లేదు. 2026లో జరగబోయే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు భావిస్తున్నారు. రాధాకృష్ణన్ కొంగు వెల్లలర్ గౌండర్ సామాజిక వర్గానికి చెందినవారు కావడం, ఈ వర్గం పశ్చిమ తమిళనాడులో ఎన్నికల ఫలితాలను నిర్ణయించే శక్తిని కలిగి ఉండడం బీజేపీకి కలిసొచ్చే అంశం. బీజేపీ రాష్ట్ర నాయకుడు కె. అన్నామలై, ఏఐఏడీఎంకె నాయకుడు ఎడప్పాడి కె. పళనిస్వామి కూడా ఇదే సామాజిక వర్గానికి చెందినవారు. దీనివల్ల గౌండర్ ఓటు బ్యాంకును ఏకీకృతం చేయడంలో రాధాకృష్ణన్ ఎంపిక కీలక పాత్ర పోషిస్తుందని బీజేపీ భావిస్తోంది.
ఇటీవల అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుండి తొలగించి, నైనార్ నాగేంద్రన్ను నియమించడం గౌండర్ సామాజిక వర్గంలో అసంతృప్తిని రేకెత్తించింది. ఈ నేపథ్యంలో రాధాకృష్ణన్ నామినేషన్ ఈ అసంతృప్తిని చల్లార్చి, కొంగు ప్రాంతంలో బీజేపీ-ఏఐఏడీఎంకె కూటమి బలాన్ని పెంచేందుకు ఉద్దేశించిన ఒక రాజకీయ చర్యగా చూడవచ్చు. ఈ నామినేషన్ ద్వారా, బీజేపీ తమిళనాడులో తన రాజకీయ ఉనికిని బలోపేతం చేయడమే కాకుండా, ఏఐఏడీఎంకెతో కూటమిని మరింత బలపరచాలని భావిస్తోంది.
బీజేపీ దక్షిణ భారత రాష్ట్రాలపై వివక్ష చూపిస్తోందనే విమర్శలు తరచూ వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో, తమిళనాడుకు చెందిన రాధాకృష్ణన్‌ను ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం ద్వారా ఈ విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నం జరిగింది. దక్షిణ భారతదేశం నుండి ఒక సీనియర్ నాయకుడిని రాష్ట్రపతి లేదా ఉపరాష్ట్రపతి వంటి ఉన్నత రాజ్యాంగ పదవికి నామినేట్ చేయడం ద్వారా, బీజేపీ దక్షిణ రాష్ట్రాల్లో తన రాజకీయ సందేశాన్ని బలపరచాలని చూస్తోంది. రాధాకృష్ణన్ రాజకీయ జీవితం, ఆర్ఎస్ఎస్తో దీర్ఘకాల సంబంధం, వివాదరహిత గవర్నర్‌గా ఆయన సేవలు, ఆయనను ఈ పదవికి అనుకూలమైన అభ్యర్థిగా చేశాయి.







