GST: పీఎం మోదీ గుడ్ న్యూస్.. దీపావళికి జీఎస్టీ తగ్గింపు..
సామాన్య పౌరులకు ఊరట కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ (GST) విధానంలో సమూల సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది దీపావళి (Deepavali) నుంటి నిత్యావసర వస్తువులపై జీఎస్టీ రేట్లను తగ్గించి పండగ ఆనందాన్ని రెట్టింపు చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) ప్రకటించారు. ఈ మేరకు స్వాతంత్ర్య వేడుకల్లో (Independence Day Celebrations) ఆయన కీలక ప్రకటన చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన వెంటనే ఆర్థిక శాఖ (Finance Department) స్పందించింది. జీఎస్టీలో ఇకపై కేవలం రెండు శ్లాబు రేట్లు మాత్రమే ఉంటాయని తెలిపింది. ప్రస్తుతం ఉన్న 5%, 12%, 18%, 28% శ్లాబుల స్థానంలో స్టాండర్డ్, మెరిట్ రేట్లు అమలులోకి రానున్నాయి. కొన్ని ఉత్పత్తులకు మాత్రమే ప్రత్యేక రేట్లు వర్తించనున్నాయి.
79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా చేసిన ప్రసంగంలో ప్రధాని మోదీ, గత ఎనిమిదేళ్లలో జీఎస్టీ విధానంలో తమ ప్రభుత్వం అనేక సంస్కరణలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయంతో తదుపరి దశ సంస్కరణలను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సంస్కరణల ద్వారా పన్ను భారం తగ్గడమే కాక, సామాన్య పౌరులకు ఆర్థిక ఉపశమనం కలుగుతుందని ఆయన హామీ ఇచ్చారు. ముఖ్యంగా, నిత్యం వినియోగించే వస్తువుల ధరలు తగ్గడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్ఠమవుతుందని, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (MSMEs) కూడా ఈ సంస్కరణల ద్వారా ప్రయోజనం పొందుతాయని పేర్కొన్నారు.
ప్రధాని ప్రకటన అనంతరం, ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ సంస్కరణలకు సంబంధించి మరిన్ని వివరాలను వెల్లడించింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధనలో భాగంగా జీఎస్టీ విధానంలో నిర్మాణాత్మక సంస్కరణలు, పన్ను రేట్ల హేతుబద్ధీకరణ, జీవన వ్యయాల తగ్గింపుపై దృష్టి సారించేలా బ్లూప్రింట్‌ను రూపొందించినట్లు తెలిపింది. ఈ సంస్కరణలను అమలు చేసేందుకు కేంద్ర, రాష్ట్ర మంత్రులతో కూడిన ఒక బృందాన్ని జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు చేసింది. ఈ బృందం రెండు శ్లాబు రేట్ల విధానంపై చర్చించి, సెప్టెంబర్‌లో జరగనున్న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఏకాభిప్రాయం సాధించనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన ఈ సమావేశం జరిగే అవకాశం ఉంది.
ఈ సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేస్తాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. నిత్యావసర వస్తువుల ధరల తగ్గింపు వినియోగదారుల కొనుగోలు శక్తిని పెంచడమే కాక, దేశీయ డిమాండ్‌ను పెంచుతుందని భావిస్తున్నారు. అదనంగా, సరళీకృత పన్ను విధానం వ్యాపారాలకు అనుకూల వాతావరణాన్ని సృష్టించి, పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఈ ప్రతిపాదనలపై సమగ్ర చర్చ జరిగి, దీపావళి నాటికి అమలులోకి వచ్చే అవకాశం ఉంది.
దీపావళి సందర్భంగా జీఎస్టీ రేట్ల తగ్గింపు, రెండు శ్లాబు విధానం అమలు వంటి సంస్కరణలు సామాన్య ప్రజలకు, వ్యాపారులకు ఆర్థిక ఉపశమనం కల్పించడమే కాక, భారత ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఒక ముందడుగుగా నిలుస్తాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. రాబోయే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఈ సంస్కరణలకు సంబంధించిన తదుపరి దశను నిర్ణయించనుంది.







