టీసీఎస్ కొత్త నిబంధనలతో… మహిళ ఉద్యోగులు
దేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ సేవల దిగ్గజం టీసీఎస్ (టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) ప్రస్తుతం ఎప్పుడు లేని కొత్త సమస్యతో సతమతమవుతోంది. కొవిడ్ తర్వాత మూడేళ్లకు వర్క్ ఫ్రమ్ హోమ్ ముగింపు పలుకుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. కొత్త నిబంధనలతో కంపెనీలో గందరగోళం నెలకొంది. ఆఫీస్‌కు రావాలని చెప్పడంతో పెద్ద సంఖ్యలో మహిళా ఉద్యోగులు రాజీనామా చేశారని కంపెనీ పేర్కొంది. టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కర్ ప్రకారం.. కంపెనీ ఉద్యోగులను ఇంటి నుండి పనికి అనుమతించడాన్ని నిలిపివేసిన తర్వాత ఎక్కువ మంది మహిళా ఉద్యోగులు రాజీనామాలు చేశారు. ఇతర కారణాలు ఉండొచ్చు గానీ, ఇదే మొదటి కారణమని ఆయన తెలిపారు. మహిళా ఉద్యోగులు వివక్షతో రాజీనామాలు చేయలేదని అన్నారు. టీసీఎస్‌లో మహిళలు పురుషుల కంటే తక్కువ రేటుతో రాజీనామా చేస్తారు. కానీ ఇప్పుడు అది పురుషులను అధిగమించింది. టీసీఎస్‌లో 6 లక్షల మందికి పైగా పనిచేస్తున్నారు. వీరిలో 35 శాతం మహిళలే ఉన్నారు. అదే సమయంలో గత ఆర్థిక సంవత్సరంలో 20 శాతం మంది ఉద్యోగులు టీసీఎస్ నుండి నిష్క్రమించారు.






