భారత్ – ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య ఒప్పందం… నేటి నుంచి
భారత్, ఆస్ట్రేలియా మధ్య కుదిరిన మధ్యంతర స్వేచ్చా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) నుంచి అమల్లోకి రానుంది. ఫలితంగా ఆస్ట్రేలియా విపణిలో జౌళి, తోళ్లు వంటి వేలాది దేశీయ ఉత్పత్తులు సుంకాల రహితంగా లభించనున్నాయి. ఈ ఒప్పందంతో వచ్చే అయిదేళ్లలో ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెట్టింపై 45-50 బిలియన్ డాలర్లకు చేరొచ్చని ఎగుమతిదార్లు, పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2న ది ఎకనామిక్ కోపరేషన్ అండ్ ట్రేడ్ అగ్రిమెంట్ (ఈసీటీఏ)పై ఇరు దేశాలు సంతకాలు చేశాయి. దీంతో జౌళి, తోళ్లు, ఫర్నీచర్, ఆభరణాలు, పరికరాలు, సహా 6000కు పైగా విభాగాల్లో భారత ఎగుమతులపై పన్నులు ఉండవు. జౌళి, దుస్తులు వంటి కార్మిక అధిరిత రంగాలు, కొన్ని వ్యవసాయ, మత్స్య ఉత్పత్తులు, తోళ్లు పాదరక్షలు, ఫర్నీచర్, క్రీడా వస్తువులు, ఆభరణాలు, విద్యుత్ ఉత్పత్తులు లబ్ది పొందనున్నాయి. భారత ఎగుమతిదార్లకు కీలక విపణుల్లో ఆస్ట్రేలియా ఒకటని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్ఫోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) ఉపాధ్యక్షుడు ఖలీద్ ఖాన్ అన్నారు.






