Google: గూగుల్ ఏఐ హబ్ నిర్ణయంతో కర్ణాటక, తమిళనాడులో ఆందోళన..
ఏపీలో గూగుల్ (Google) భారీ పెట్టుబడి ప్రకటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా దక్షిణ భారత రాష్ట్రాల మధ్య ఈ నిర్ణయం పెట్టుబడుల పోటీని మరింత వేడెక్కించింది. విశాఖపట్నం (Visakhapatnam) లో గూగుల్ రూ.1.36 లక్షల కోట్లతో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయబోతున్నట్టు ప్రకటించడంతో ఈ రేస్ ఆసక్తికర మలుపు తీసుకుంది. కర్ణాటక (Karnataka) రాష్ట్రం ఈ ప్రాజెక్ట్‌ను కోల్పోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. బంగళూరు (Bengaluru) సిలికాన్ వ్యాలీగా (Silicon Valley) పేరు గాంచినప్పటికీ, ఇంత పెద్ద పెట్టుబడిని ఏపీ దక్కించుకోవడం అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వానికి షాక్‌గా మారింది.
కర్ణాటక కాంగ్రెస్ (Karnataka Congress) ఈ వ్యవహారంలో ఏపీ ఇచ్చిన భారీ రాయితీలను కారణంగా చూపుతూ ట్వీట్ చేసింది. గూగుల్ ను తమ రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మళ్లించారని, సబ్సిడీలు చూపించి పెట్టుబడిని పొందారని ఆ పార్టీ పేర్కొంది. ఈ ట్వీట్ తో సోషల్ మీడియాలో రాజకీయ దుమారం చెలరేగింది. వెంటనే ఏపీ వైపు నుంచి ప్రతిస్పందన వచ్చింది. తెలుగు దేశం పార్టీ (TDP) అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా, “ఏపీ అభివృద్ధి ఇప్పుడు కర్ణాటక కాంగ్రెస్ ఫేవరెట్ టాపిక్ అయింది. మన ప్రగతి వారికి ఘాటు అనిపిస్తోంది’’ అంటూ కౌంటర్ ట్వీట్ చేసింది.
ఇక రెండు రాష్ట్రాల మంత్రుల మధ్య సోషల్ మీడియా వార్ కొనసాగుతోంది. ఏపీ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) తరచూ కర్ణాటక పారిశ్రామిక వేత్తలను ఆహ్వానిస్తూ ట్వీట్లు చేస్తున్నారు. అక్కడి మౌలిక వసతులు సరిపోవడం లేదని కొన్ని కంపెనీలు అసంతృప్తి వ్యక్తం చేయగా, లోకేశ్ “ఏపీలో పెట్టుబడి పెట్టండి’’ అంటూ స్పందించడం కర్ణాటక ప్రభుత్వానికి అసహనం కలిగించింది. దీనిపై అక్కడి ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే (Priyank Kharge), ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (D.K. Shivakumar) బహిరంగంగా అభ్యంతరం తెలిపారు.
గూగుల్ పెట్టుబడులపై ఈ వివాదం వచ్చిన తర్వాత కర్ణాటక కాంగ్రెస్ మరింత దూకుడుగా వ్యాఖ్యలు చేయడం ప్రారంభించింది. అయితే ఈ పరిస్థితిని చక్కదిద్దడంలో విఫలమవడంతో, అక్కడి ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతున్నాయి. మరోవైపు, ఏపీ ప్రభుత్వం మాత్రం కేంద్ర సహకారంతో ఈ ప్రాజెక్టును విజయవంతం చేయడానికి కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ప్రతిపాదనకు కేంద్రంలోని బీజేపీ (BJP) మద్దతు ఇవ్వడంతో గూగుల్ పెట్టిన అతిపెద్ద పెట్టుబడిగా ఇది నిలిచింది.
పదేళ్లపాటు పన్ను రాయితీలు ఇవ్వడం, అవసరమైన భూసేకరణ వేగంగా పూర్తి చేయడం వంటి సదుపాయాలు అందించడంతో గూగుల్ నిర్ణయం ఏపీ వైపే నిలిచింది. ఈ పెట్టుబడితో రాష్ట్రానికి సుమారు 1.80 లక్షల ఉద్యోగావకాశాలు సృష్టికానున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి పెద్ద బూస్ట్‌గా నిలుస్తుందని నిపుణులు భావిస్తున్నారు. అయితే పొరుగు రాష్ట్రాల అసంతృప్తి, రాజకీయ ఆరోపణలు ఏపీ సర్కార్‌కు కొత్త సవాళ్లు సృష్టిస్తున్నాయి.







