Kamal Hassan: రాజ్యసభ గడప తొక్కనున్న కమల్ హాసన్..!!

తమిళ సినీ దిగ్గజం, మక్కళ్ నీది మయ్యం (MNM) పార్టీ వ్యవస్థాపకుడు కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టేందుకు రంగం సిద్ధమైంది. DMK పార్టీ గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు పడుతున్నాయి. ఈ డాది జూలైలో ఖాళీ అయ్యే రాజ్యసభ (Rajya Sabha) సీట్లలో ఒక దాన్ని కమల్ హాసన్ కు ఇచ్చేందుకు ఇరు పార్టీలు అంగీకరించాయి. దీంతో జూలైలో కమల్ హాసన్ రాజ్యసభలో అడుగు పెట్టబోతున్నారు.
2018లో కమల్ హాసన్ MNM పార్టీని స్థాపించారు. తమిళనాడు రాజకీయాల్లో మార్పు తీసుకొచ్చే లక్ష్యంతో ఆయన ఈ పార్టీని ప్రారంభించినట్లు చెప్పారు. అయితే 2019 లోక్‌సభ ఎన్నికల్లో 36 స్థానాల్లో పోటీ చేసిన MNM 3.72% ఓటు షేర్ సాధించి మూడో స్థానంలో నిలిచింది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ కోయంబత్తూర్ (సౌత్) నుంచి పోటీ చేసి బీజేపీ అభ్యర్థి వనతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 180 స్థానాల్లో పోటీ చేసిన MNM కేవలం 2.52% ఓటు షేర్ సాధించింది. 2022లో స్థానిక ఎన్నికల్లో 140 స్థానాల్లో పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ వైఫల్యాలు MNM పార్టీ ఉనికిని ప్రశ్నార్థకం చేశాయి. దీంతో కమల్ హాసన్ కూటమి రాజకీయాల వైపు అడుగులు వేశారు.
2024 లోక్‌సభ ఎన్నికల ముందు కమల్ హాసన్ DMK నేతృత్వంలోని ఇండియా కూటమితో చేతులు కలిపారు. కోయంబత్తూర్ లేదా చెన్నై సౌత్ నుంచి కమల్ హాసన్ పోటీ చేయాలనుకున్నారు. అయితే DMK ఆ స్థానాలను ఇతర మిత్రపక్షాలకు కేటాయించింది. దీంతో MNM ఎన్నికల్లో పోటీ చేయకుండా, తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ స్థానాల్లో డిఎంకే కూటమికి ప్రచారం చేయడానికి అంగీకరించింది. ఇందుకుగానూ డిఎంకే అధ్యక్షుడు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ 2025లో ఒక రాజ్యసభ సీటును ఎంఎన్‌ఎంకు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ అంగీకారం మేరకు ఇప్పుడు కమల్ హాసన్ రాజ్యసభ సభ్యుడు కాబోతున్నారు.
DMK కూటమి 2024 ఎన్నికల్లో తమిళనాడులోని 39 స్థానాలనూ గెలుచుకుంది. కమల్ హాసన్ ప్రచారం ఈ విజయంలో కీలక పాత్ర పోషించిందని డిఎంకే వర్గాలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో, ఈ జూన్‌లో ఖాళీ అయ్యే ఆరు రాజ్యసభ సీట్లలో ఒకటి కమల్ హాసన్‌కు కేటాయించేందుకు డిఎంకే సిద్ధమైంది. ఈ మేరకు తమిళనాడు మంత్రి పీకే శేఖర్ బాబు, డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్.. కమల్ హాసన్‌ను కలిసి నామినేషన్ సిద్ధం చేసుకోవాలని చెప్పినట్లు సమాచారం.
కమల్ హాసన్ రాజ్యసభ నామినేషన్ ఆయన రాజకీయ జీవితంలో కీలక మలుపుగా చెప్పవచ్చు. రాజ్యసభలోకి ప్రవేశించడం ద్వారా ఆయన తమిళనాడు వాయిస్ ను జాతీయ స్థాయిలో చర్చించేందుకు అవకాశం కలుగుతుంది. మరోవైపు.. కమల్ హాసన్ నామినేషన్ DMK-MNM కూటమి బలాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. 2026లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, కమల్ హాసన్ రాజ్యసభ సభ్యత్వం ఎంఎన్‌ఎం పార్టీకి కొత్త ఊపిరి పోస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.