Defence: రక్షణ మంత్రిగా సిఎం, కేంద్ర కేబినేట్ లో డాషింగ్ లీడర్..?

భారత ఉప రాష్ట్రపతి(Vice President Of India)గా జగదీప్ దంకర్ రాజీనామా చేయడంతో ఆ స్థానంలో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తిని రేపుతున్న అంశం. రాజకీయంగా ఎంతో ప్రాధాన్యత కూడుకున్న ఉప రాష్ట్రపతి ఎంపిక విషయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనే దానిపై జాతీయ మీడియా ఆసక్తిగా గమనిస్తోంది. ఈ సమయంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పేరు ప్రముఖంగా వినపడుతోంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న రాజనాథ్ సింగ్(Rajnath Singh) మంచి వక్త కూడా.. గతంలో ఆయన ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు.
ముందు నుంచి బిజెపిలో బలమైన నాయకుడిగా కొనసాగుతున్నారు. దీనితో ఆయన ఉప రాష్ట్రపతి అయ్యే అవకాశం ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.. మరి ఆయన ఉప రాష్ట్రపతి అయితే ఆయన నిర్వహిస్తున్న రక్షణ శాఖను ఎవరికి అప్పగించవచ్చు అనేదానిపై ఎన్నో సందేహాలు ఉన్నాయి. ఈ విషయంలో ప్రధానంగా వినపడుతున్న పేరు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్(Yogi Adityanath). యోగి ఆదిత్యనాథ్ దూకుడు స్వభావం కలిగిన నేత. హిందుత్వాదాన్ని నరనరానా జీర్ణించుకున్న ఆయన.. ఉత్తరప్రదేశ్ లో సంచలన నిర్ణయాలు తీసుకుంటూ సంఘవిద్రోహ శక్తులకు చుక్కలు చూపిస్తున్నారు.
అలాంటి వ్యక్తి రక్షణ శాఖ మంత్రి అయితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇదే అభిప్రాయంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాజ్ నాథ్ సింగ్ వయసు 74 ఏళ్ళు. బిజెపి రాజ్యాంగం ప్రకారం ఆయన మరో ఏడాదిలో రిటైర్ కావాల్సి ఉంటుంది. దీనితో ఆయనను ఉప రాష్ట్రపతి చేస్తే బాగుంటుందని కేంద్ర ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర మంత్రి కేశవ ప్రసాద్ మౌర్యను ఎంపిక చేసే అవకాశాలు కనబడుతున్నాయి. ప్రస్తుతం కేంద్ర ఎన్నికల సంఘం ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టింది. నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయనుంది ఎన్నికల సంఘం. ఉప రాష్ట్రపతిగా మొత్తం ఆరు పేర్లు వినపడుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా, బీహార్ సిఎం నితీష్ కుమార్ పేర్లు వినపడుతున్నాయి.