ఏపీకి రూ.4787 కోట్లు… తెలంగాణకు రూ.2486 కోట్లు
కేంద్ర పన్నులు, సుంకాల్లో రాష్ట్రాల వాటా కింద కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ నిధులు విడుదల చేసింది. జూన్ నెలకు గానూ మూడో విడత కింద మొత్తం రూ.1,18,280 కోట్లు విడుదల చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. జూన్ నెలలో చెల్లించాల్సిన విడతతో పాటు ఒక విడత అడ్వాన్స్ మొత్తాన్ని సైతం విడుదల చేసినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది. ఈ మొత్తాన్ని మూలధన వ్యయాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలు వేగవంతానికి వినియోగించాలని రాష్ట్రాలకు ఆర్థిక శాఖ సూచించింది.
అలాగే, ప్రధాన ప్రాజెక్టులు/ స్కీముల అమలుకు అవసరమైన నిధులు అందించే ఉద్దేశంతో ఈ నిధులు విడుదల చేసినట్లు తెలిపింది. ఇందులో భాగంగా పన్నుల వాటా కింద ఆంధ్రప్రదేశ్‌కు రూ.4,787 కోట్లు, తెలంగాణకు రూ.2,486 కోట్లు దక్కాయి. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం వాటాను కేంద్రం రాష్ట్రాలకు అందిస్తోంది. ఈ మొత్తాన్ని ఒక ఆర్థిక సంవత్సరంలో 14 విడతల్లో విడుదల చేస్తోంది.






