Jagdeep Dhankar: సొంత నిర్ణయమే జగదీప్ ధన్ ఖడ్ కొంప ముంచిందా…?

భారత ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ ఖడ్ (Vice President Jagdeep Dhankar) ఆకస్మిక రాజీనామా (Resignation) దేశ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. జులై 21న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తొలి రోజున ఆయన తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు సమర్పించారు. అనారోగ్య కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నప్పటికీ, ఈ వాదనను రాజకీయ విశ్లేషకులు, విపక్ష నాయకులు ఒప్పుకోవడం లేదు. ఈ రాజీనామా వెనుక బీజేపీ (BJP) అధిష్ఠానం ఒత్తిడి, అభిశంసన వివాదం, రాజకీయ వ్యూహాలు ఉన్నాయనే ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి.
జగదీప్ ధన్ఖడ్ 2022 ఆగస్టు 11న ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. రాజస్థాన్‌లోని ఓ సాధారణ రైతు కుటుంబంలో 1951లో జన్మించిన ధన్ ఖడ్ , న్యాయవాదిగా, రాజకీయ నాయకుడిగా సుదీర్ఘకాలం ఉన్నారు. 1989లో జనతాదళ్ తరపున ఎంపీగా ఎన్నికైన ఆయన, 1990లో చంద్రశేఖర్ కేబినెట్‌లో సహాయ మంత్రిగా పనిచేశారు. 2019 నుంచి 2022 వరకు పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా (West Bengal Governor) బాధ్యతలు నిర్వహించిన ఆయన, మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వంతో తీవ్ర ఘర్షణలకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ కార్యకర్తలా పనిచేశారనే విమర్శలు ఎదుర్కొన్నారు. రాజ్యసభ ఛైర్మన్‌గా (Rajyasabha Chairman) ధన్ ఖడ్ వ్యవహార శైలి కూడా వివాదాస్పదంగా మారింది. విపక్షాల నోరు మూయడం, అధికార పక్షానికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడం వంటి ఆరోపణలు ఆయనపై వచ్చాయి.
అయితే, జస్టిస్ యశ్వంత్ వర్మ అభిశంసన (Justice Yaswanth Varma impeachment) విషయంలో ఆయన తీసుకున్న నిర్ణయం రాజీనామాకు కీలక కారణం అని సమాచారం. 68 మంది విపక్ష ఎంపీలు సంతకాలు చేసిన అభిశంసన నోటీసును ధన్ ఖడ్ అంగీకరించడం, ఈ విషయంలో కేంద్రంతో సంప్రదించకుండా స్వతంత్రంగా నిర్ణయం తీసుకోవడం బీజేపీకి రుచించలేదని సమాచారం. ఇన్నేళ్లూ బీజేపీ చెప్పిందల్లా చేసుకుంటూ వచ్చిన ధన్ఖడ్, అందుకోసం చెడ్డపేరు మూటగట్టుకున్నారు. గవర్నర్ హోదాలో, రాజ్యసభ ఛైర్మన్ హోదాలో ఉండి కూడా బీజేపీ కార్యకర్తలా పని చేస్తున్నారనే విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ తొలిసారి సొంతంగా తీసుకున్న ఈ నిర్ణయానికి ఆయన ఇప్పుడు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అయితే అభిశంసన తీర్మానాన్ని ఆయన ఎందుకు సొంతంగా తీసుకున్నారనేది అంతుచిక్కడం లేదు. దీని వెనుక విపక్షాల ప్రోద్బలం ఉందని బీజేపీ అనుమానిస్తోంది. అందుకే ధన్కడ్ ను రాజీనామా చేయాలని ఆదేశించిందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇన్నేళ్లూ పార్టీ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్లినా కూడా, తాను తీసుకున్న ఓ నిర్ణయాన్ని బీజేపీ హైకమాండ్ తప్పుబట్టడం, రాజీనామా చేయాలని ఆదేశించడంతో ధన్కఢ్ కూడా మనస్తాపానికి గురైనట్టు తెలుస్తోంది. అందుకే ఆయన ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే రాజీనామా చేసేశారు.
జగదీప్ ధన్ ఖడ్ రాజీనామా భారత రాజకీయాల్లో అరుదైన సంఘటన. ఆయన స్వతంత్ర నిర్ణయం అధికార పక్షానికి రుచించకపోవడం, బీజేపీ అధిష్ఠాన ఒత్తిడి, అభిశంసన బెదిరింపులు ఈ రాజీనామాకు కారణాలుగా చెప్పుకుంటున్నారు. ఈ సంఘటన రాజ్యసభ ఛైర్మన్ స్వతంత్రత, రాజకీయ ఒత్తిళ్లపై కొత్త చర్చకు దారితీసింది. ధన్ ఖడ్ రాజీనామా దేశ రాజకీయ చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోనుంది.