Israel-Iran: ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తే ఏం జరుగుతుంది..? ప్రపంచదేశాల్లో ఎందుకీ ఆందోళన..?

ఇరాన్ -ఇజ్రాయెల్ (Iran-Israel) మధ్య యుద్ధం కాస్తా ప్రపంచాన్ని కుదిపేస్తోంది. నేరుగా యుద్ధరంగంలో ఉన్న ఇజ్రాయెల్ , ఇరాన్ పరిస్థితులు ఓకే..కానీ యుద్ధంతో సంబంధం లేని భారత్ లాంటి దేశాలకుఈ ప్రభావం బెంబేలెత్తిస్తోంది. ఈ యుద్ధ ప్రభావం నుంచి ఎలా నెట్టుకు రావాలా అని ప్రపంచదేశాలు తలలు పట్టుకుంటున్నాయి. యుద్ధాన్ని ఆపండిరా బాబు.. ఇక చాలు అంటుంటే.. ఇరాన్, ఇజ్రాయెల్ జబ్బలు చరుచుకుంటూ పోరాడుతున్నాయి. దీన్ని నిలువరించాల్సిన అమెరికా కాస్తా.. నేరుగా యుద్ధరంగంలోకి దిగి.. ఇరాన్ అణు స్థావరాలపై బాంబింగ్ చేసింది. ఇంకేముంది ఇప్పుడు యుద్ధం మరింత తీవ్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
ఇరాన్‌లోని అణు స్థావరాలే లక్ష్యంగా అగ్రరాజ్యం బాంబుల వర్షం కురిపించడంతో.. హర్మూజ్ జలసంధిని మూసి వేసేందుకు ఆ దేశ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.తాజా పరిణామాలతో భారత్‌తో సహా ఇతర దేశాలకు ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఇరాక్, జోర్డాన్, లెబనాన్, సిరియా, యెమెన్ సహా పశ్చిమ ఆసియా దేశాలతో భారత దౌత్యంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ యుద్ధం నేపథ్యంలో భారత్ నుంచి ఇరాన్, ఇజ్రాయెల్‌కు వెళ్లే ఎగుమతులు భారీగా కూడా భారీగా తగ్గిపోయాయి. ఇరు దేశాలకు కీలక మార్గం అయిన హర్మూజ్ (Hormuz) జలసంధి మూత పడుతుండటంతో క్రూడ్ ఆయిల్ ధరలు 80 డాలర్ల ఎగువకు చేరే అవకాశం ఉంది. ఈ వార్తల నేపథ్యంలో గత 5 నెలల్లో చమురు ధరలు సోమవారం (జూన్ 23న) గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 2.7 శాతం పెరిగి 79.12 డాలర్లకు చేరుకోగా.. ఈ పరిణామం ఆసియా మార్కెట్లపై చమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. మరోవైపు, దేశంలో ఇంధన ధరలు పెరుగుతాయనే ఆందోళన మొదలైంది. అయితే, ప్రస్తుతానికి నిల్వలు ఉన్నాయని కేంద్రమంత్రి ప్రకటించడంతో ఊరటనిచ్చినా.. ఈ యుద్ధం మరికొన్ని రోజుల పాటు కొనసాగితే.. భారత్ పై భారీ ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు.
‘హార్ముజ్ జలసంధి’ వ్యూహాత్మక ప్రాముఖ్యత
ఇరాన్, గల్ఫ్ అరబ్ దేశాల మధ్య ఇరుకైన సముద్ర చోక్‌పాయింట్ అయిన హార్ముజ్ జలసంధి ప్రపంచంలోని అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాలలో ఒకటి. బ్లూమ్‌బెర్గ్ నివేదిక ప్రకారం.. ప్రపంచ చమురులో దాదాపు 20 శాతం ప్రతి రోజూ ఈ జలసంధి గుండా వెళుతుంది. ఇది ద్రవీకృత సహజ వాయువు (LNG) కు కీలకమైన మార్గం కూడా.. ప్రపంచ LNG వాణిజ్యంలో దాదాపు మూడింట ఒక వంతు ఈ మార్గాన్ని ఉపయోగిస్తుంది.
భారత్ ఇంధన సరఫరాపై ప్రభావం
భారత్ మధ్యప్రాచ్యం నుండి ముఖ్యంగా ఇరాక్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్ నుండి ముడి చమురు దిగుమతులపై ఎక్కువగా ఆధారపడుతోంది. దాని మొత్తం చమురు దిగుమతుల్లో దాదాపు 40 శాతం వాటా కలిగి ఉంది. ఈ ఎగుమతులు ప్రధానంగా హార్ముజ్ జలసంధి ద్వారా రవాణా జరుగుతుంది. అయితే ఇటీవలి సంవత్సరాలలో భారత్ తన ఇంధన వనరులను గణనీయంగా వైవిధ్యపరిచింది. ఇప్పుడు ముడి చమురులో ఎక్కువ భాగం రష్యా నుండి వస్తుంది. ఇది సూయజ్ కాలువ, కేప్ ఆఫ్ గుడ్ హోప్ లేదా పసిఫిక్ మహాసముద్రం వంటి ప్రత్యామ్నాయ షిప్పింగ్ మార్గాలను ఉపయోగిస్తుంది. అదనంగా భారత్ ప్రాథమిక LNG సరఫరాదారు అయిన ఖతార్ – US, ఆస్ట్రేలియా, రష్యా వంటి ఇతర ప్రధాన LNG ఎగుమతిదారులతో పాటు – భారతదేశానికి రవాణా చేయడానికి హార్ముజ్ జలసంధిపై ఆధారపడటం లేదు.