Egypt: గాజాలో శాంతి కుసుమాలు.. ఫలించిన ట్రంప్ యంత్రాంగం ప్రయత్నాలు..

రెండేళ్లకు పైగా నెత్తురోడుతున్న గాజా (Gaza) కు.. శాంతి సందేశం వినిపించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ (Trump) చేసిన ప్రయత్నాలు ఫలించాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్ పై ట్రంప్ ఒత్తిడి ఫలితాన్నిచ్చింది. గాజాను ఆక్రమించాలని ప్రయత్నాలు చేసిన ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు.. చివరకు ట్రంప్ ఒత్తిడికి తలొగ్గారు. దీంతో హమాస్ కూడా ట్రంప్ హెచ్చరికలతో దారికొచ్చింది. ఫలితంగా చిరస్మరణీయ శాంతి ఒప్పందం మొగ్గ తొడిగింది.
చరిత్రాత్మక గాజా శాంతి ఒప్పందానికి అధికార ముద్రపడింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. ఆ తరువాత ఈజిప్టు, ఖతార్, తుర్కియేల అధినేతలు సంతకాలు చేశారు. డజన్ల మంది వివిధ దేశాల అగ్ర నేతల సమక్షంలో ఈ సంతకాలు జరిగాయి. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో ఈ కార్యక్రమం జరిగింది. ఒప్పందం ప్రకారం.. గాజాలో కాల్పుల విరమణ, బందీల విడుదల అమలవుతున్నాయి. బందీల విడుదల ప్రారంభమైంది. ఈజిప్టు అధ్యక్షుడు అబ్దుల్ ఫతే ఎల్-సిసీ, ట్రంప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంతకాల కార్యక్రమానికి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును ఆహ్వానించారు. అయితే ఆయన రాలేదు. యూదు సెలవు దినం దగ్గరలో ఉన్నందున తాను రాలేనని ఆయన తప్పించుకున్నారు.
అయితే పాలస్తీనా అథారిటీ(పీఏ) అధ్యక్షుడు మహమ్మద్ అబ్బాస్, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, ఇతర ముస్లిం నేతలు దీనికి హాజరు కావడమే అసలు కారణమని సమాచారం. గాజాలో యుద్ధానంతరం పీఏకు ఎలాంటి పాత్ర ఉండకూడదని చాలాకాలం నుంచి నెతన్యాహు స్పష్టంగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో సదస్సులో పాల్గొంటే తప్పుడు సంకేతాలు వెళ్తాయని భావించి గైర్హాజరైనట్లు తెలుస్తోంది..
గాజా శాంతి ఒప్పందానికి సహకరించిన వివిధ దేశాల అధినేతలకు ట్రంప్ కృతజ్ఞతలు తెలిపారు. గతంలో చాలా మంది మూడో ప్రపంచ యుద్ధం గురించి మాట్లాడారని, కానీ ఇప్పుడది జరగబోదని తేలిపోయిందని స్పష్టం చేశారు. శాంతి ఒప్పందానికి సంబంధించిన మార్గదర్శకాలను త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. సదస్సులో జోర్డాన్ రాజు అబ్దుల్లా, తుర్కియే అధ్యక్షుడు ఎర్డోగాన్, ఖతార్ ఎమిర్ షేక్ తమీమ్ బిన్ హమద్, ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్, పాకిస్థాన్, ఇటలీ ప్రధానులు షెహబాజ్ షరీఫ్, జార్జియా మెలోనీ, పాలస్తీనా అథారిటీ అధ్యక్షుడు అబ్బాస్, భారత్ తరఫున విదేశాంగశాఖ సహాయ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.