Durand Line: ‘‘డ్యూరాండ్ లైన్’’.. వివాదం వెనక కారణమేంటి..?

అఫ్ఘాన్-పాకిస్తాన్ మధ్య డ్యూరాండ్ లైన్ (Durand Line) వివాదం శతాబ్దానికి పైగా కొనసాగుతోంది. ఈ వివాదానికి 132 ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 2,640 కి.మీ (1,640 మైళ్ళు) విస్తరించి ఉన్న డ్యూరాండ్ రేఖ 1893లో అప్పటి బ్రిటిష్ ఇండియా విదేశాంగ కార్యదర్శి సర్ మోర్టిమర్ డ్యూరాండ్ , ఆఫ్ఘనిస్తాన్ పాలకుడు అమీర్ అబ్దుర్ రెహమాన్ ఖాన్ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం ఏర్పడింది. ఈ రేఖ బ్రిటీష్ ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ మధ్య సరిహద్దును నిర్వచించింది. అయితే, ఈ రేఖ సరిహద్దుల్లో ఉన్న పష్టూన్లు, బలూచ్ తెగలను రెండుగా చీల్చింది.
1893 నాటి డ్యూరాండ్ రేఖను ఆఫ్ఘనిస్తాన్ ఒప్పుకోవడం లేదు. తమ పష్టూన్ల తెగకు చెందిన వారు, పాకిస్తాన్ లోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సులో ఉన్నారని, ఇది ఆఫ్ఘనిస్తాన్‌కు చెందుతుందని తాలిబాన్లతో సహా, మునుపటి ఆఫ్ఘాన్ పాలకులు వాదిస్తున్నారు. పాకిస్తాన్ దీనిని ఒప్పుకోవడం లేదు. ఇప్పటికే పాక్ వాయువ్య ప్రాంతంలోని ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు ప్రజలు తమను తాము పాకిస్తానీయులుగా చెప్పుకోవడం లేదు. ఈ ప్రాంతంలో ‘‘పాక్ తాలిబాన్లు’’ ….పాక్ ఆర్మీ, పోలీసులపై తీవ్రమైన దాడులు చేస్తున్నారు.
భౌగోళిక, రాజకీయ ప్రాముఖ్యత:
డ్యూరాండ్ రేఖ కేవలం మ్యాప్‌లో ఒక రేఖ మాత్రమే కాదు, ఇది దక్షిణాసియాలోని అత్యంత వివాదాస్పద ప్రాంతాల్లో ఒకటిగా మిగిలింది. పాకిస్తాన్ ఖైబర్ ఫఖ్తుంఖ్వా ప్రావిన్సు తమ సార్వభౌమాధికారం కిందకు వస్తుందని చెబుతోంది. ఇటు ఆఫ్ఘాన్ మాత్రం తమకు జరిగిన అన్యాయమని వాదిస్తోంది. తరుచుగా ఈ సరిహద్దు వెంబడి ఆఫ్ఘాన్-పాక్ సైనిక దళాలు కాల్పులకు తెగబడుతుంటాయి. అరేబియా సముద్రంలోకి ప్రవేశం కల్పించే బలూచిస్తాన్‌తో పాటు పష్టూన్ భూభాగాలనున తిరిగి ఇవ్వాలని అఫ్ఘాన్ కోరుతోంది. 2017లో సరిహద్దు వద్ద పాకిస్తాన్ కంచె నిర్మించడంతో ఈ వివాదం మరింత ముదిరింది.