Pakistan: అఫ్గాన్ తో అన్ని సంబంధాలు కట్.. పాకిస్తాన్ కీలక నిర్ణయం…!

అఫ్గాన్ పై ఫైటర్ జెట్లతో దాడులు చేసిన పాకిస్తాన్ (Pakistan).. చివరకు సరిహద్దుల్లో జరిగిన పోరులో భంగపడింది. అఫ్గాన్ బలగాలు సరిహద్దుల్లోని పాక్ చెక్ పోస్టులపై దాడులు చేసి హడలెత్తించాయి. దీంతో పాక్ సైనికులు పరుగులు పెట్టారు. ఈ పరిణామంతో అఫ్గాన్లు గెలిచామంటూ సంబరాలు చేసుకుంటున్నారు. కానీ.. ఈ పరిణామాల మధ్య పాక్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
అఫ్గాన్ తో ఉన్న అన్ని రకాల ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలను పూర్తిగా నిలిపివేస్తున్నట్లు పాకిస్థాన్ సంచలన ప్రకటన చేసింది. ఇరు దేశాల బలగాల మధ్య ఘర్షణలు తీవ్రతరమైన నేపథ్యంలో పాక్ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.ఇరు దేశాల మధ్య ప్రస్తుతం ప్రతిష్టంభన నెలకొందని, శత్రుత్వం ముదిరిందని స్పష్టం చేశారు పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్. “ఇప్పటికిప్పుడు ఆఫ్ఘనిస్థాన్‌తో మాకు ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ఎలాంటి సంబంధాలు లేవు” అని ఆయన తేల్చిచెప్పారు. బెదిరింపులు కొనసాగుతుండగా చర్చలు జరపడం సరైంది కాదని, ఉగ్రవాద ముప్పుపై చర్యలు తీసుకున్న తర్వాతే చర్చలకు అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.
తమ సైన్యం జరిపిన దాడులను ఆసిఫ్ పూర్తిగా సమర్థించారు. తమపై జరిగిన దాడికి ప్రతిదాడి చేయడం సహజమని అన్నారు. తాము సాధారణ పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని, కేవలం ఉగ్రవాదుల రహస్య స్థావరాలపైనే దాడులు చేశామని వివరించారు. ఆఫ్ఘనిస్థాన్ గడ్డపై నుంచి తెహ్రీక్-ఇ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) లాంటి అనేక ఉగ్రవాద సంస్థలు పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తాము లక్ష్యంగా చేసుకున్న టీటీపీ చీఫ్ నూర్ వలీ మెహసూద్ వారి భూభాగంలోనే ఉన్నారని ఆసిఫ్ స్పష్టం చేశారు.
పాకిస్థాన్ ఆరోపణలపై ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ స్పందించారు. పాకిస్థాన్ మినహా తమ పొరుగున ఉన్న మిగతా ఐదు దేశాలతో సత్సంబంధాలు ఉన్నాయని ఆయన తెలిపారు. తమకు ఎవరితోనూ గొడవలు వద్దని, తమ దేశంలో శాంతి నెలకొని ఉందని ఆయన వ్యాఖ్యానించారు. “పాకిస్థాన్ ఒక్కటే మా పొరుగు దేశం కాదు, మిగతా దేశాలన్నీ మాతో సంతోషంగానే ఉన్నాయి” అని ఆయన అన్నారు.