Donald Trump: గాజా శాంతి ప్రణాళిక.. ట్రంప్ పై ప్రశంసల వర్షం..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 20 సూత్రాల శాంతి ప్రణాళిక తొలిదశలో భాగంగా రెండేళ్లు హమాస్ చెరలో ఉన్న 20 మంది ఇజ్రాయెలీ బందీలు స్వదేశానికి చేరుకున్నారు (Trump peace plan). ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య కాల్పుల విరమణకు చొరవ చూపిన ట్రంప్‌పై అంతర్జాతీయంగా ప్రశంసలు దక్కుతున్నాయి. చివరకు ట్రంప్ విధానాలను తీవ్రంగా విమర్శించే మాజీ అధ్యక్షుడు జోబైడెన్ (Jeo Biden) కూడా అభినందించారు. గాజా డీల్‌ను స్వాగతించారు. ఆ ఒప్పందం కుదిరేలా మార్గం సుగమం చేయడం సామాన్యమైన విషయం కాదని పేర్కొన్న ఆయన.. బందీల విడుదలపై హర్షం వ్యక్తంచేశారు. అమెరికాతో పాటు ఈ ప్రపంచం మద్దతుతో మధ్యప్రాచ్యం శాంతి మార్గంలో ఉందని బైడెన్ వ్యాఖ్యానించారు.
మరో మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ట్రంప్‌ను ప్రశంసించారు. ‘‘హమాస్ దాడితో మొదలైన ఘర్షణ వల్ల కలిగిన మానవ నష్టాన్ని చూడటం ఎంతగానో బాధించింది. ఇప్పుడు కాల్పుల విరమణ కుదరడం, 20 మంది బందీలు విడుదల కావడం, గాజాలోకి మానవతా సహాయం వెళ్తుండటం గొప్ప విషయం. ఒప్పందం కుదిరేవరకు చొరవ చూపిన ట్రంప్, ఆయన యంత్రాంగం, ఖతార్, వివిధ దేశాలకు ఈ క్రెడిట్ దక్కుతుంది’’ అని ప్రశంసించారు. ఈ పొగడ్తలపై అధ్యక్షుడు సంతోషం వ్యక్తంచేశారు. ‘‘ఇదంతా చాలా బాగుంది. వారు వాస్తవాలు మాట్లాడుతున్నారు’’ అని పేర్కొన్నారు.
కాగా.. గాజా శాంతి ఒప్పందానికి అధికార ముద్ర పడింది. ప్రపంచ దేశాల నేతల సాక్షిగా ఒప్పందంపై తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంతకం చేశారు. ఆ తరువాత ఈజిప్టు, ఖతార్, తుర్కియేల అధినేతలు సంతకాలు చేశారు. డజన్ల మంది వివిధ దేశాల అగ్ర నేతల సమక్షంలో ఈ సంతకాలు జరగడం విశేషం. ఈజిప్టులోని షర్మ్ ఎల్-షేక్‌లో ఈ కార్యక్రమం జరిగింది.