Selam: అన్నాడీఎంకేతోనే విజయ్ పార్టీ.. తమిళనాడులో విపక్ష కూటమి కసరత్తు…

వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓ వైపు అధికార డీఎంకే కూటమి నిలబడగా.. మరోవైపు విపక్ష అన్నాడీఎంకే కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. దీనిలో భాగంగా కలసి వచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటూ ముందుకెళ్తోంది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా సినీ నటుడు విజయ్(Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (TVK)తో పొత్తు కుదుర్చుకోనున్నట్లు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) పరోక్ష వ్యాఖ్యలు చేశారు.
అన్నాడీఎంకేతో పొత్తు కుదుర్చుకోవాలంటూ ఆ పార్టీ ప్రధాన నాయకులు,జిల్లా కార్యదర్శులు, కార్యకర్తలు ఒత్తిడి చేస్తున్నారని, అంతేకాకుండా తాను పాల్గొంటున్న ప్రచార సభల్లో టీవీకే జెండాలతో ఆ పార్టీ కార్యకర్తలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు ఈపీఎస్. టీవీకేతో పాటు మరికొన్ని పార్టీలతో పొత్తు కోసం చర్చించే అవకాశముందన్నారు. ఈ సారి తమ నేతృత్వంలో బలమైన కూటమి ఏర్పాటవుతుందన్నారు. తమ కూటమిలో ఉన్న పార్టీలు స్వేచ్ఛగా ఉంటాయని, అయితే డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, డీపీఐ, వామపక్షాలు అధికార పార్టీని విమర్శించకుండా బానిసలుగా ఉంటున్నాయని ఈపీఎస్ ఎద్దేవా చేశారు.
నిజానికి ఈ ఎన్నికల్లో ముందుగా ఒంటరి పోరుకు సిద్ధమైంది టీవీకే. అయితే ఎప్పుడైతే కరూర్ తొక్కిసలాట ఘటన జరిగిందో ఆపార్టీ మనోధైర్యం దెబ్బతింది . పోలీసుల కేసులకు భయపడి ముఖ్యనాయకులు అజ్ఞాతంలో ఉన్నారు. కేడర్ నైతిక స్థైర్యం దెబ్బతింది. ఈదశలో బలమైన డీఎంకేను ఎదుర్కోవాలంటే.. విపక్ష అన్నాడీఎంకే సహాయం అవసరమని విజయ్ గుర్తించారు. దీంతో అన్నాడీఎంకేతో కలిసి ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.