Islamabad: యుద్ధ ట్యాంకుల్లో పోసేందుకు పెట్రోల్ కే దిక్కులేదు.. పాక్ యుద్ధం చేస్తుందట..!

దశాబ్దాల దుష్పరిపాలనకు నిలువెత్తు నిదర్శనం పాకిస్తాన్. అవినీతి, బంధుప్రీతి, స్వార్థచింతనతో పాక్ గత పాలకుల నిర్వాకం కారణంగా పాకిస్తాన్ నిలువెత్తు కష్టాల్లో కూరుకుపోయింది. గతంలో ప్రతీ విషయానికి భారత్ తో పోల్చుకునే పాకిస్తాన్.. పొరుగుదేశంపై పైచేయి సాధించాలన్న దుర్భుద్దితో ఆర్థిక ప్రణాళికలను పక్కనపెట్టింది. ఆయుధాలను పోగేసుకోవడంపై ఫోకస్ పెట్టింది. అనుకున్నట్లే అణ్వాయుధాలను పోగేసింది. కానీ… తిండి గింజలు, తాగునీరు సైతం దొరక్క ఇబ్బందుల పాలవుతున్నారు పాక్ ప్రజలు.
‘‘తిండి లేకపోతే గడ్డి తినైనా బతుకుతాం.. అవసరమైతే ఆకలితో మాడుతాం. కానీ అణ్వాయుధాలు మాత్రం తయారుచేసి తీరుతాం’’ అని నాటి పాకిస్థాన్ ప్రధానమంత్రి జుల్ఫీకర్ అలీ భుట్టో(zulfikar ali bhutto) ప్రకటన. ఆయన నాడు అనుకున్నదే జరిగింది. నేడు పాక్ వద్ద అణ్వస్త్రాలు ఉన్నాయి కానీ.. అన్నవస్త్రాలకు మాత్రం తీవ్ర కొరత ఏర్పడింది. స్వీయ తప్పిదాల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ.. దివాళా అంచుకు చేరింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి, చిరకాల మిత్రదేశం చైనా(China) పుణ్యమా అని కొద్దిగా తెప్పరిల్లింది. కానీ ప్రమాదం ఇంకా పూర్తిగా తొలగిపోలేదు. ఇలాంటి స్థితిలో భారత్‌తో స్వల్పకాల యుద్ధం చేసినా పాక్ ఆర్థిక వ్యవస్థ నిండా మునగడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు.
ధనిక దేశం నుంచి..
దాదాపు 50 ఏళ్ల కిందట పాకిస్థాన్.. దక్షిణాసియాలో ధనిక దేశం. స్వాతంత్య్రం వచ్చాక ఆ దేశం మంచి ఆర్థిక వృద్ధిని కనబరచింది. ముఖ్యంగా 1960, 1970లలో ఇది ప్రస్ఫుటంగా కనిపించింది. బలమైన ఆర్థిక నిర్వహణ, భారీగా విదేశీ సాయం, వ్యవసాయం, పారిశ్రామిక వృద్ధిపై దృష్టి వంటి అంశాలు బాగా కలిసొచ్చాయి.
నేడు పాక్.. దక్షిణాసియాలోనే అత్యంత పేద దేశాల్లో ఒకటిగా మారింది. దుష్పరిపాలన, సైనిక నియంతలు, సీమాంతర ఉగ్రవాదాన్ని దేశ విధానంగా మలచుకోవడం, భారత్‌తో గిల్లికజ్జాలు, ఖరీదైన ఆయుధపోటీ వంటివి ఈ దుస్థితికి దారితీశాయి. కొవిడ్ మహమ్మారితో కుదేలైన పాక్ ఆ తర్వాత ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఆపసోపాలు పడుతోంది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను జైల్లో పెట్టడంతో మొదలైన రాజకీయ సంక్షోభం, బలోచిస్థాన్‌లో వేర్పాటువాదానికి తోడు ఆర్థిక సవాళ్లు ఆ దేశాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి.
టీ పొడిని దిగుమతి చేసుకోవడానికి అప్పు చేయాల్సి వస్తోందని.. అందువల్ల టీ వినియోగాన్ని తగ్గించాలని స్వయానా పాక్ ప్రణాళిక శాఖ మంత్రి అహ్‌సాన్ ఇక్బాల్ కోరడాన్ని బట్టి ఆ దేశ ఆర్థిక వ్యవస్థ దుస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్న కారణంగా ఆర్థిక చర్యల కార్యదళం (FATF).. ఐదేళ్లుగా ఆ దేశాన్ని ‘గ్రే లిస్ట్’లో పెట్టింది. దీంతో రుణాలు దొరకడం కష్టమైపోయింది.
జీడీపీలో 70 శాతానికి ఆ దేశ అప్పులు చేరాయి. ఆదాయంలో 40 నుంచి 50 శాతం.. వడ్డీల చెల్లింపునకే సరిపోతోంది. దివాళా ముప్పు నుంచి రక్షించాలంటూ పాక్.. ఐఎంఎఫ్(IMF)ను ఆశ్రయించింది. ఇలా ఈ ఆర్థిక సంస్థను ఆ దేశం ఆశ్రయించడం ఇది 25వసారి. ఐఎంఎఫ్ ఇచ్చిన 300 కోట్ల డాలర్ల స్వల్పకాల ఆర్థిక ప్యాకేజీతో పాక్ గట్టెక్కింది. సౌదీ అరేబియా, యూఏఈ, చైనా కూడా వందల కోట్ల డాలర్ల రుణాలను అందించాయి. గత నెలలో 130 కోట్ల డాలర్ల సాయం కోసం ఐఎంఎఫ్‌తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మొత్తం 700 కోట్ల డాలర్ల ఉద్దీపన ప్యాకేజీని అందిస్తోంది. ఇందుకోసం పాక్ అనేక షరతులకు తలొగ్గింది. 1.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు కోత పెట్టింది. ఆరు మంత్రిత్వశాఖలను మూసేసింది. మరో రెండు శాఖలను విలీనం చేసింది.