Kabul: కాబూల్ లో పాక్ ఫైటర్ జెట్ దాడులు.. ప్రతిదాడులకు సిద్ధమైన టీటీపీ..!

అఫ్గానిస్థాన్ (Afghanistan) రాజధాని కాబుల్ పై పాక్ ఫైటర్ జెట్లు విరుచుకుపడ్డాయి. తెహ్రీక్ ఇ తాలిబన్ పాకిస్థాన్ (TTP) చీఫ్ నూర్ వాలి మెహ్సూద్ (Noor Wali Mehsud) స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ మరణించి ఉండొచ్చని పలు అంతర్జాతీయ మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఈ దాడులపై పాక్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అఫ్గానిస్థాన్ విదేశాంగమంత్రి ఆమిర్ ఖాన్ ముత్తాఖీ (Amir Khan Muttaqi) భారత పర్యటనలో ఉన్న సమయంలో ఈ దాడులు జరగడం గమనార్హం.
పాక్ వైమానిక (Pakistan Airstrike)దాడిలో అనేక పౌర నిర్మాణాలు దెబ్బతిన్నాయని స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. టీటీపీ చీఫ్ లక్ష్యంగా దాడులు చేయడాన్ని దాని అనుబంధ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ప్రతీకార దాడులకు సిద్ధంగా ఉండాలని టీటీపీ మద్దతుదారులకు పిలుపునిచ్చాయి. ఈ సంఘటనపై దర్యాప్తు జరుగుతోందని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తాలిబన్ ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.
అయితే ఈ దాడులకు ముందు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రి వర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. అఫ్గాన్ ప్రజలను పాక్‌కు శత్రువులుగా అభివర్ణించారు. తాము వారికి ఎంత గౌరవం ఇచ్చినప్పటికీ.. వారు పాక్‌కు ద్రోహం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వారిపై బలమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్థాన్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సైతం ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఫ్గాన్ సరిహద్దు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమపై చేస్తున్న దాడులను ఇక సహించమని.. ఓపిక నశించిందన్నారు. అఫ్గాన్లు గతంలో.. ప్రస్తుతం భారత్‌కు విధేయులుగా ఉంటున్నారని.. భవిష్యత్తులో కూడా అలాగే ఉంటారని ఆగ్రహం వ్యక్తంచేశారు.