Indian Army: రేడియోతో దొరికిపోయిన పహల్గం దాడి మాస్టర్ మైండ్

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాం(Pahalgam)లో ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులపై భారత ఆర్మీ ప్రతీకారం తీర్చుకుంది. ఈ ఉగ్రవాదుల్లో కీలకంగా భావిస్తున్న మాస్టర్ మైండ్ ను వేటాడి హతమార్చింది. శ్రీనగర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఉగ్రదాడి సూత్రధారి సులేమాన్ షా అలియాస్ హషీం మూసాను కాల్చిపారేసింది. ఆపరేషన్ మహాదేవ్ అనే కోడ్‌నేమ్ తో ఈ దాడి మొదలుపెట్టింది ఆర్మీ. వారిపై కొన్నాళ్ళుగా నిఘా పెట్టిన భారత ఆర్మీ.. పక్కా వ్యూహంతో బరిలోకి దిగింది. ఈ కాల్పుల్లో మొత్తం ముగ్గురు ఉగ్రవాదులను హతమార్చింది.
లష్కరే తోయిబా (LeT) ఉగ్రవాది అయిన సులేమాన్ షా, పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఎలైట్ యూనిట్ – స్పెషల్ సర్వీస్ గ్రూప్ (SSG) లో మాజీ కమాండోగా ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. ఆ తరువాత అతను ఉగ్రవాద కార్యకలాపాలను నిమిత్తం అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ సయీద్ నేతృత్వంలోని లష్కరే తోయిబాలో జాయిన్ అయ్యాడట. ఈ ఆపరేషన్ కు జమ్మూ కాశ్మీర్ లోని శ్రీనగర్ లోని మహాదేవ్ శిఖరం పేరు పెట్టారు. మహాదేవ్ శిఖరం దిగువ ప్రాంతంలోని దట్టమైన అడవుల్లో ఉగ్రవాదులు దాక్కున్నారనే సమాచారంతో భారత ఆర్మీ రంగంలోకి దిగింది.
స్థానికుల సహకారం కూడా తీసుకుని ఈ ఆపరేషన్ చేపట్టింది. జూలై ప్రారంభంలో వారు అక్కడ ఉన్నారనే సమాచారంతో ఆర్మీ తన యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఆ ప్రాంతంలో చైనా అల్ట్రా రేడియో కమ్యూనికేషన్ యాక్టివ్‌గా ఉందని బలగాలకు ఒక క్లూ దొరకడంతో, అక్కడి నుంచి ఆపరేషన్ వేగవంతం చేసారు. లష్కరే తోయిబా ఎన్‌క్రిప్ట్ చేసిన మెసేజ్ ల కోసం చైనీస్ రేడియోను ఉగ్రవాదులు వాడుతున్నారు. ఆపరేషన్ మహాదేవ్‌లో లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాద స్థావరం యొక్క ఫోటోను కూడా జాతీయ మీడియా బయటపెట్టింది. ఈ దాడి తర్వాత ఉగ్రవాదుల వద్ద నుంచి గ్రైనేడ్ లు, తుపాకులను స్వాధీనం చేసుకుంది ఆర్మీ.