Iran: ఖమేని భద్రత మరింత కట్టుదిట్టం..సిగ్నళ్లకు దూరంగా సురక్షిత బంకర్ లోకి ఇరాన్ సుప్రీం లీడర్..

ఇజ్రాయెల్-ఇరాన్ (Iareal-Iran) యుద్ధంపై ప్రపంచానికి పూర్తి క్లారిటీ ఇచ్చింది.ఇన్నాళ్లు పరోక్షంగా ఇజ్రాయెల్ కు ఆయుధాలు, దౌత్య సాయం చేస్తూ వచ్చిన అగ్రరాజ్యం.. ఇప్పుడు పూర్తిస్థాయి యుద్ధంలో దిగింది. తన బి స్పిరిట్ బాంబర్లను రంగంలోకి దించి.. ఇరాన్ అణు కేంద్రాలపై క్లస్టర్ బాంబులను ప్రయోగించింది. దీంతో ఇప్పుడు తాము ఇజ్రాయెల్ తో పాటు అమెరికాను ఎదుర్కోవలసి ఉంటుందని ఇరాన్ కు తెలిసి వచ్చింది.
ఇటీవలే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనిని లేపేస్తామంటూ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ప్రకటించారు. అయితే తాము చంపం కానీ.. లొంగిపోవాలన్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. అంతేకాదు.. ఖమేనీ ఎక్కడ ఉన్నారో తమకు తెలుసన్నారు. దీంతో ఇప్పుడు తమ సుప్రీం లీడర్ ఖమేనిని సురక్షిత ప్రాంతానికి ఇరాన్ తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా సిగ్నల్స్ కూడా లేని సురక్షిత బంకర్ లో ఖమేని కుటుంబం ఉన్నట్లు తెలుస్తోంది.
శనివారం ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో కొన్ని బంకర్లలో ఆశ్రయం పొందుతున్న కీలక కమాండర్లు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు టెహ్రాన్‌లోని కీలక అణుస్థావరాలపై అమెరికా దాడుల చేస్తుండటంతో ఖమేనీకి ఇచ్చిన భద్రతను మరింత కట్టుదిట్టం చేసినట్లు తెలుస్తోంది. ఎటువంటి సిగ్నళ్లకు అందకుండా ఉండడానికి ఆయన ఉన్న ప్రదేశంలో ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్‌లను పూర్తిగా నిలిపివేసినట్లు ఇరాన్ మీడియా వర్గాలు వెల్లడించాయి. భారీ భద్రత మధ్య అత్యంత సురక్షితమైన బంకర్‌లో ఆయన ఆశ్రయం పొందుతున్నట్లు సమాచారం. ఆయనకు అత్యంత సన్నిహితులైన ముగ్గురు వ్యక్తులు ప్రస్తుత పరిస్థితులు, టెహ్రాన్ ప్రతిదాడుల గురించి ఆయనతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
యుద్ధం తీవ్రమవుతున్న నేపథ్యంలో ఇరాన్ సుప్రీం నేత ఖమేనీ తన వారసులుగా ముగ్గురిని ఎంపిక చేసినట్లు న్యూయార్క్ టైమ్స్ ఓ కథనం ప్రచురించింది. ఐఆర్‌జీసీలోని కీలక పదవులకు నియమించాల్సిన కమాండర్ల పేర్లను కూడా ఖమేనీ ప్రకటించినట్లు పేర్కొంది. సాధారణంగా నూతన సుప్రీం నేతను నియమించే ప్రక్రియ సున్నితమైన, కష్టతరమైన అంశం. ఈ ప్రక్రియ నెలల తరబడి కొనసాగుతుంది. సుప్రీం నేత ప్రతిపాదించిన పేర్లను ఇరాన్‌లోని మతాధికారులు పరిశీలించి కొన్ని పేర్లను ఎంపిక చేస్తారు.
యుద్ధంలో ఖమేనీకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆయన ప్రతిపాదించిన వారిలో ఒకరిని ఎన్నుకోవడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. సుప్రీం లీడర్ ఎంపిక చేసిన వారిలో ఆయన కుమారుడు మోజ్తాబా ఖమేనీ ఉన్నట్లు వస్తున్న వార్తలను ఇరాన్ అధికారులు ఖండించారు. ఇరాన్ సుప్రీం నాయకుడికి అపారమైన అధికారాలు ఉంటాయి. ఇరాన్ సాయుధ దళాలకు కమాండర్ ఇన్ చీఫ్‌గా, న్యాయ వ్యవస్థ, శాసనసభ, కార్యనిర్వాహక శాఖకు అధిపతిగా ఆ సుప్రీం లీడర్ వ్యవహరిస్తారు.