Delhi: భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి బ్రిటన్ మద్దతు…

ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (UNSC)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం దక్కాలన్న వాదనకు బ్రిటన్ నుంచి బలమైన మద్దతు లభించింది. ప్రపంచ వేదికపై భారత్ తన ‘సరైన స్థానాన్ని’ పొందాలని యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలోని రాజ్‌భవన్‌లో సమావేశమైన అనంతరం ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.
భారత్ సాధిస్తున్న అద్భుతమైన అభివృద్ధిని, అంతర్జాతీయ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించగల సామర్థ్యాన్ని స్టార్మర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. “భద్రతా మండలిలో భారత్ తన హక్కుగా పొందాల్సిన స్థానాన్ని దక్కించుకోవడాన్ని మేము చూడాలనుకుంటున్నాం” అని ఆయన అన్నారు. భారత్ శాశ్వత సభ్యత్వానికి ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్, రష్యా వంటి దేశాలు మద్దతు తెలుపగా, ఇప్పుడు యూకే కూడా అదే బాటలో నిలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
తన భారత పర్యటన ఉద్దేశాన్ని వివరిస్తూ, గత దశాబ్ద కాలంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందంతో తాను ఇక్కడికి వచ్చినట్లు స్టార్మర్ తెలిపారు. ఇరు దేశాల మధ్య వాణిజ్య భాగస్వామ్యాన్ని రెట్టింపు చేయడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. సాంకేతికత, ఆవిష్కరణల రంగాల్లో భారత్, యూకేలు ప్రపంచ నాయకులుగా కలిసి నిలుస్తున్నాయని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలో బాలీవుడ్ చిత్రాల నిర్మాణానికి సంబంధించి ఒక ఒప్పందం కుదిరిందని కూడా ఆయన ప్రకటించారు.