Surat: సాగర దిగ్భందంలో పాకిస్తాన్… రంగంలోకి విక్రాంత్ యుద్ధనౌక

పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ (Pakistan) ను అష్టదిగ్భందనం చేస్తోంది కేంద్రం. ఓవైపు పాక్ ఆర్థిక వ్యవస్థ వెన్ను విరిచేలా కార్యకలాపాలు చేపట్టడంతో పాటు ఆదేశంలో యుద్ధ భయాన్ని రేకెత్తిస్తోంది. దీనికి తోడు సాగర తీరంలోనూ నౌకలను మోహరిస్తోంది.పహల్గాం ఊచకోత తర్వాత భారత నౌకాదళ కార్యకలాపాలు ఊపందుకున్నాయి. ఈ నెల 24న ఐఎన్‌ఎస్ సూరత్ యుద్ధనౌక నుంచి ఎంఆర్‌శామ్ క్షిపణి పరీక్ష జరిగింది. ఇది.. సముద్రతలానికి చేరువగా దూసుకొస్తున్న ఒక లక్ష్యాన్ని విజయవంతంగా పేల్చేసింది. యుద్ధవిమానాలు, యూఏవీలు, హెలికాప్టర్లు, క్రూజ్ క్షిపణులను నేల కూల్చడానికి ఎంఆర్‌శామ్ ఉపయోగపడుతుంది.
క్యారియర్ బ్యాటిల్ ..
విమానవాహక నౌకలు ఒంటరిగా రంగంలోకి దిగవు. జలాంతర్గాములు, డిస్ట్రాయర్లు, ఫ్రిగేట్లు వంటి యుద్ధనౌకలతో కూడిన ఒక సమూహం దాని వెంట వెళుతుంది. వీటన్నింటినీ కలిపి క్యారియర్ బ్యాటిల్ గ్రూప్ (CBG)గా పిలుస్తారు. ఇది చాలా శక్తిమంతమైన దాడి బృందం. సముద్రంలో సువిశాల ప్రాంతంపై పూర్తి ఆధిపత్యం సాధించడానికి ఇది ఉపయోగపడుతుంది.
విక్రాంత్ కదలికలను బట్టి.. పాక్ వ్యూహాత్మక రేవులైన కరాచీ(karachi), గ్వాదర్‌ల దిగ్బంధానికి భారత్ పూనుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది. ఆ దేశ వాణిజ్యంలో 60 శాతానికిపైగా ఈ రేవుల నుంచే సాగుతోంది. పాక్ తన చమురు అవసరాల్లో 85 శాతాన్ని సముద్ర మార్గంలోనే దిగుమతి చేసుకుంటోంది. దిగ్బంధం వల్ల దేశంలో పెట్రోలు, డీజిల్‌తోపాటు అనేక నిత్యావసర వస్తువులకు తీవ్ర కొరత ఏర్పడుతుంది. దేశంలోని దాదాపు మూడోవంతు విద్యుదుత్పత్తిపై ప్రభావం పడుతుంది.
తీరం నుంచి 700 కిలోమీటర్ల దూరంలో ఉన్న పాకిస్థాన్ పంజాబ్ ప్రావిన్స్‌పై విక్రాంత్ దృష్టిపెట్టినట్లు చెబుతున్నారు. పాక్ సైనిక మౌలిక వసతుల్లో ఎక్కువభాగం ఇక్కడే కేంద్రీకృతమయ్యాయి. ఒకవేళ యుద్ధం చేయాల్సివస్తే విక్రాంత్.. కీలక పాత్ర పోషిస్తుంది. ఈ క్యారియర్ గ్రూప్.. వాయు, ఉపరితల, సముద్రగర్భంలో భిన్న కార్యకలాపాలు నిర్వహించగలదు. విక్రాంత్‌పై ఉండే మిగ్-29కె ఫైటర్ జెట్‌లు పాకిస్థాన్‌లోని మస్రూర్, సర్గోదా వంటి చోట్ల ఉన్న ముఖ్యమైన వైమానిక, సైనిక స్థావరాలను నాశనం చేయగలవు. ఈ యుద్ధవిమానాలు ఏకబిగిన 850 కిలోమీటర్ల వరకూ ప్రయాణించగలవు. భారత వాయుసేనతో సమన్వయం చేసుకుంటూ దాడులు చేస్తే పాక్ సైనిక ఆదేశిక, నియంత్రణ వ్యవస్థలను గణనీయంగా దెబ్బతీయవచ్చు.
పాక్ నేవీ వెలవెల..
భారత నౌకాదళ బలం ముందు పాక్ నేవీ ఎందుకూ కొరగాదు. భారత్ వద్ద శక్తిమంతమైన విమానవాహక నౌకలు, అణు జలాంతర్గాములు ఉండగా.. పాక్ వద్ద ఇలాంటివి లేవు. చైనా నుంచి సమకూర్చుకున్న వార్‌షిప్‌లే ఆ దేశం వద్ద ఎక్కువగా ఉన్నాయి. ఆధునికీకరణ నత్తనడకన సాగుతోంది. పాక్ నేవీకి చైనా తయారీ టైప్054ఏ/పీ ఫ్రిగేట్లు, తుర్కియే నిర్మిత మిల్జెమ్ కార్వెట్‌లే ఆధారం. వీటిలో అనేకం ఇంకా తయారీ దశలోనే ఉన్నాయి. చైనా నుంచి సమీకరిస్తున్న హంగోర్ తరగతి సబ్‌మెరైన్లు 2028 నాటికిగానీ అందే అవకాశం లేదు. మరోవైపు భారత నౌకాదళ ఆధునికీకరణ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో భారత నౌకా దిగ్బంధం ఉచ్చును తిప్పికొట్టే సామర్థ్యం పాక్ నేవీకి లేదు.
ఉగ్రదాడి అనంతరం నౌకాదళం చేపట్టిన చర్యల్లో ముఖ్యమైంది.. విమానవాహకనౌక ఐఎన్‌ఎస్ విక్రాంత్ మోహరింపు. ఇది కర్ణాటకలోని కార్వార్ నౌకాస్థావరం నుంచి పశ్చిమ నౌకాదళ కమాండ్‌లో చేరినట్లు శాటిలైట్ చిత్రాలు స్పష్టంచేశాయి. ప్రస్తుతం ఇది అరేబియా సముద్రంలో సంచరిస్తోంది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ అధునాతన భారీ యుద్ధనౌక కదలికలు పాక్‌లో గుబులు పుట్టిస్తున్నాయి.