Delhi: భారత్-పాక్ తొలి శాంతి చర్చలు.. ఆసక్తిగా గమనిస్తున్న అంతర్జాతీయ సమాజం..

పహల్గాం ఉగ్రదాడి.. ఆపై ఆపరేషన్ సిందూర్(sindur) తర్వాత జరుగుతున్న శాంతిచర్చలపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూస్తుంటోంది. ఈ చర్చలతో ఇరుమదేశాల మధ్య సమస్యలు పరిష్కారమై.. శాంతి కుసుమాలు వెల్లివిరియాలని ప్రపంచదేశాలు కోరుకుంటున్నాయి. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దు గ్రామాల ప్రజలుకూడా ఈ చర్చలు ఫలించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నారు. అయితే ఈ చర్చల ఫలితమెంత..? వీటితో శాంతి సాధ్యమవుతుందా…?
సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ ల తొలి సమావేశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం సరిహద్దుల్లో నిశ్శబ్ద వాతావరణం నెలకొన్నప్పటికీ, ఇరు దేశాల మధ్య జరగనున్న “తొలి శాంతి చర్చలు” ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఇరు దేశాల “మిలిటరీ ఆపరేషన్స్” డైరెక్టర్ జనరల్స్ స్థాయిలో ఈ చర్చలు జరగనున్నాయి. అయితే, ఈ చర్చలు ప్రస్తుతానికి కేవలం కాల్పుల విరమణకు మాత్రమే పరిమితం కానున్నాయి. ఇతర ముఖ్యమైన అంశాలపై తదుపరి దశలో చర్చలు జరిగే అవకాశం ఉంది.
భారత్ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. రక్షణ బలగాలను పూర్తి స్థాయిలో అప్రమత్తం చేస్తూనే, వ్యూహాత్మక మౌనం పాటిస్తోంది. పాకిస్తాన్ ఒకవేళ దాడులకు పాల్పడితే, వాటికి దీటుగా ప్రతిదాడులు చేయాలని భారత రక్షణ బలగాలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయబడ్డాయి. మరోవైపు, వీసాల రద్దు , సింధు జలాల ఒప్పందం రద్దు వంటి ఆంక్షలు కొనసాగనున్నాయి. రాబోయే రోజుల్లో భారత్ మరిన్ని ఆంక్షలను చర్చల ద్వారా పాకిస్తాన్‌పై విధించే అవకాశం ఉంది.
ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్ పాక్ పై ఎంతగట్టిగా పడిందంటే.. సాక్షాత్తూ ఆదేశ జాతీయ భద్రతా సలహాదారు స్వయంగా ఫోన్ చేసి. ఇండియాకు కాల్పుల విరమణ ప్రతిపాదన చేశారు. దీనికి చాలా కారణాలున్నాయి. ఒకటి పహల్గాం ఉగ్రదాడితో పాక్ ఒంటరైంది. అంతర్జాతీయ సమాజం మొత్తం .. ఉగ్రదాడిపై పాక్ ను వేలెత్తి చూపింది. దీనికి తోడు పాక్ మంత్రి ఆసిఫ్ క్వాజా.. నోటి దురద పాకిస్తాన్ కు శాపంగా మారింది. అదీ కాక లేటెస్టుగా పాక్ వైమానిక అధికారి. పుల్వామా దాడికి తామే కారణమంటూ ఘనంగా చెప్పుకున్న పరిస్థితి ఉంది. ఈ పరిణామాలన్నీ పాక్ కు వ్యతిరేకంగా మారాయని చెప్పక తప్పదు.
మరోవైపు… పాకిస్తాన్ ఆర్థికంగా దివాళా తీసే స్థితిలో ఉంది. దీనికి తోడు ఇప్పుడు సిందూర్ ఆపరేషన్ తో మరింతగా ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఐఎంఎఫ్ దగ్గర నుంచి బెయిల్ అవుట్ కు .. కాల్పుల విరమణకు అమెరికా లింకు పెట్టడం కూడా.. పాక్ కాల్పులవిరమణకు ముందుకు రావడానికి ఓ కారణంగా చెబుతున్నారు.మరింత నష్టపోకుండా ముందు జాగ్రత్త పడిన పాకిస్తాన్, చర్చల ద్వారా శాంతికి చేతులు చాచింది.