Donald Trump: ఒబామాకు ఇచ్చినప్పుడు నోబెల్ నాకెందుకివ్వరు? ట్రంప్ ఆవేదన..!

నోబెల్ అవార్డుపై గంపెడాశలుపెట్టుకున్న ట్రంప్.. విచిత్రమైన భావోద్వేగానికి గురవుతున్నారు. తనకు నోబెల్ బహుమతి వచ్చి తీరాలని.. అందుకు కావాల్సిన అర్హతలన్నీ తనకు ఉన్నాయని బలంగా నమ్ముతున్నారు. ఇదే విషయమై ఇప్పటికే బహిరంగంగా పలుసార్లు వ్యక్తీకరించారు కూడా. చివరాఖరుకు హమాస్, ఇజ్రాయెల్ కు ముక్కుతాడు వేసి.. శాంతి చర్చలకు ఒప్పించారు కూడా. ఇంత చేసినా.. తనకు నోబెల్ శాంతి బహుమతి వస్తుందో రాదో అన్న భయం , ఆందోళన ట్రంప్ ను వెంటాడుతోంది.
నోబెల్ శాంతి బహుమతి (Nobel Peace Prize)పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. నేడు ఈ అవార్డుకు సంబంధించి ప్రకటన రానున్న నేపథ్యంలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. యూఎస్ మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా (Barack Obama)కు నోబెల్ ఇవ్వడంపై అక్కసు వెళ్లగక్కారు. ఏమీ చేయకపోయినా ఒబామాకు ఇచ్చారని, ఎనిమిది యుద్ధాలు ఆపిన తనకు వస్తుందో, రాదో తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు.
గాజాలో శాంతి నెలకొల్పడంతో సహా తాను ఎనిమిది యుద్ధాలను ఆపడంలో విజయం సాధించానంటూ ఉద్ఘాటించారు ట్రంప్. అయినా, తనకు ఈ అవార్డు ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ఒబామా ఏమీ చేయలేదని, పైగా అమెరికాను నాశనం చేశారని విమర్శలు చేశారు. ‘అతను ఏమీ చేయకపోయినా అవార్డు పొందాడు. అది ఎందుకిచ్చారో అతనికి కూడా తెలియదు. ఏమీ చేయకుండా అతను యూఎస్‌ను నాశనం చేసినందుకే వారు ఆ బహుమతిని ఇచ్చారు. కానీ, నేను ఎనిమిది యుద్ధాలు ఆపాను. ఇంతకుముందు ఎప్పుడూ ఇది జరగలేదు. అయినా వారు ఏం చేయలేదు. వాళ్లు ఏమీ చేయరని నాకు తెలుసు. అయినా నేను దానికోసం చేయలేదు. అనేకమంది ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చేశాను’ అని ట్రంప్ అన్నారు. 2009లో ఒబామా ఈ ప్రతిష్ఠాత్మకమైన అవార్డును అందుకున్నారు.
రెండోసారి అధికారం చేపట్టినప్పటినుంచి ట్రంప్ నోబెల్ బహుమతి కోసం తీవ్రంగా ఆరాటపడుతున్నారు. ఇందుకోసం దీర్ఘకాలంగా కొనసాగుతున్న యుద్ధాలతో పాటు అనేక ఘర్షణలు ఆపానంటూ స్వయంగా ఆయనే ప్రకటించుకున్నారు. ఈ క్రమంలోనే పాక్ సైన్యాధిపతి మునీర్‌తో సహా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులు ట్రంప్ పేరును నోబెల్ బహుమతికి నామినేషన్‌కు పంపించారు. నోబెల్ శాంతి బహుమతికి సంబంధించి నేడు ప్రకటన వెలువడనుంది.