TANA: తానా మహాసభలు..టీటిడి చైర్మన్‌కు తెలుగుతేజం పురస్కారం
ఉత్తర అమెరికా తెలుగు సంఘం (TANA) ప్రతి రెండేళ్ళకోమారు నిర్వహించే తానా మహసభలు ఈసారి కూడా అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలుగువారి సాంస్కృతిక వైభవాన్ని తలపించేలా కార్యక్రమాలు ఈ మహాసభల్లో కనువిందు చేయనున్నాయి. జూలై 3 నుంచి 5వ తేదీ వరకు డిట్రాయిట్ (Detroit) లో జరిగే ఈ తానా 24వ ద్వైవార్షిక మహాసభలకు ప్రపంచం నలుమూలల నుంచి ఎంతోమంది తెలుగువాళ్ళు హాజరుకానున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు వస్తున్నారు.
టాలీవుడ్ లో సీనియర్ నటులు, నేటితరం నటులు, హీరోయిన్‌లు, ఇతర కళాకారులు ఈ వేడుకలకు వస్తున్నారు. రాజేంద్రప్రసాద్, మురళీ మోహన్ తో పాటు హీరో నిఖిల్, పాపులర్ హీరోయిన్ సమంత, ఐశ్వర్య రాజేశ్, యాంకర్ సుమ, దర్శకులు కె. రాఘవేంద్రరావు, అనిల్ రావిపూడి, బోయపాటి శ్రీను, వంటి ప్రముఖతారాగణం ఈ వేడుకల్లో పాల్గొంటోంది. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బి.ఆర్. నాయుడు కూడా ఈ వేడుకల్లో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనను ‘తెలుగు తేజం’ అవార్డుతో తానా సత్కరించనున్నట్లు కాన్ఫరెన్స్ చైర్మన్ గంగాధర్ నాదెళ్ళ తెలిపారు.
ఈ మహాసభల్లో ప్రముఖ సంగీత దర్శకులచే సంగీత విభావరులను కూడా ఏర్పాటు చేశాము. తమన్, చిత్ర, సునీత ఎస్‌పిబి చరణ్ వాళ్ళ సంగీత విభావరులు వచ్చినవారిని ఉల్లాసపరిచేలా ఉంటాయి. ఎన్నోకార్యక్రమాలు, ఎంతోమంది ప్రముఖులు వచ్చే ఈ తెలుగు వేడుకలకు అందరూ వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను.







