TLCA: ఘనంగా టిఎల్ సిఎ దీపావళి వేడుకలు
న్యూయార్క్ లోని తెలుగు సారస్వత సాంస్కృతిక సంఘం (TLCA) ఆధ్వర్యంలో దీపావళి వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా నేపథ్యగాయని గీతామాధురి, అతిధులుగా డ్యాన్స్ మాస్టర్ సత్య, సింగర్ హనుమాన్, బిగ్ బాస్ అరియానా గ్లోరీ వచ్చారు. న్యూయార్క్ లోని హిందూ టెంపుల్ లో జరిగిన ఈ వేడుకలకు పలువురు ప్రముఖులు, టిఎల్ సిఎ మాజీ అధ్యక్షులు, బోర్డ్, ఇసి సభ్యులు ఇతరులు హాజరయ్యారు. గణేశ ప్రార్థనలతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. నరసింహ, భక్తిగీతాల కీర్తనలను చిన్నారులు ఆలపించారు. కృష్ణుడి ఇతివృత్తంపై చిన్నారులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ వేడుకలకు గెస్ట్ గా వచ్చిన సినీ నృత్య దర్శకుడు సత్య వారం క్రితమే న్యూయార్క్ వచ్చి పలువురు పిల్లలకు డ్యాన్స్ పై శిక్షణ ఇచ్చారు. శిక్షణ పొందిన చిన్నారులు, యువతీ యువకులు దీపావళి వేడుకల్లో తమ నృత్యాలతో అందరినీ ఆకట్టుకున్నారు. నేపథ్యగాయని గీతామాధురి పాడిన పాటలు అందరినీ అలరించాయి.
టిఎల్ సిఎ అధ్యక్షుడు సుమంత్ రామ్ సెట్టి, బోర్డ్ ట్రస్టీస్ చైర్ ఉమెన్ రాజి కుంచం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు, కమ్యూనిటీ ప్రముఖులు, ట్రస్టీలు, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. టిటిఎ వ్యవస్థాపకులు, కమ్యూనిటీ ప్రముఖులు పైళ్ళ మల్లారెడ్డి గారుఈ వేడుకకు వచ్చారు. చివరన ఈ వేడుకలను విజయవంతం చేసినవారందరికీ టిఎల్ సిఎ నాయకులు ధన్యవాదాలు తెలియజేశారు.






