కరోనా మృతుల్లో అమెరికా అగ్రగామి
అమెరికా కరోనా మృతుల్లోనూ అగ్రగామినేగా నిలిచింది. కరోనా మాహమ్మారిని ఎదుర్కోవడంలో ట్రంప్ ప్రభుత్వం అసమర్థ నిర్వాకం ఫలితంగా లక్ష మంది అమెరికన్లు కరోనా బారిన పడి చనిపోయారు. ప్రపంచంలో ఇంత దారుణమైన పరిస్థితి మరే దేశంలోనూ లేదు. దీనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండడంతో ట్రంప్ ఎదురు దాడికి దిగారు. వచ్చే ఎన్నికల్లో తాను తిరిగే ఎన్నికయ్యే అవకాశాలు సన్నగిల్లుతున్నట్లు సర్వేలు పేర్కొంటుండడంతో ట్రంప్‌లో అసహనం పెరిగిపోతోంది. అమెరికాలో లక్షకు చేరిన కరోనా మృతుల వివరాలను న్యూయార్క్ టైమ్స్ పత్రిక మొత్తం పేర్లతో సహా వెల్లడించింది. ఇదంతా మీడియా సృష్టి అని అధ్యక్షుడు కొట్టిపారేశారు.
వైట్ హౌస్ లో వైరస్ టాస్క్ ఫోర్స్ కమిటీ చీఫ్, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోని ఫౌసీతో సహా పలువురు నిపుణులు ట్రంప్ వ్యాఖ్యలతో విభేదించారు. కరోనా మరణాల సంఖ్య వాస్తవానికి ఇంకా ఎక్కువగానే ఉంటుందని వారు చెప్పారు. ఎటువంటి పరీక్షలు చేయని వారే నర్సింగ్ హోంలో, వారి వారి ఇళ్లలో మృత్యువాత పడుతున్నారని అవేవీ అధికారిక లెక్కల్లోకి రావడం లేదన్నారు. అంతేకాదు, మొదట్లో కరోనా మరణాలను న్యూమోనియా మరణాలుగా చూపించారని వారు చెప్పారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి తెరవడంపై ట్రంప్‌కు ఉన్న శ్రద్ధ కరోనా వైరస్ నుంచి ప్రజలను కాపాడడంపై లేదని వారు విమర్శించారు.






