అమెరికా నుంచి 300 మంది భారతీయుల తరలింపు
కరోనా ప్రేరిత ఆంక్షల కారణంగా అమెరికాలో చిక్కుకున్న 300 మంది భారతీయులను వందేభారత్ మిషన్ కింద నాలుగో ప్రత్యేక విమానంలో స్వదేశానికి తరలించారు. అమెరికాలోని జెఎఫ్‌కె అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇద్దరు పిల్లలతో సహా మొత్తం 329 మంది బెంగళూరుకు ఎయిర్ ఇండియా విమానం ద్వారా 25న చేరుకున్నారు. మొదటి దశలో ఎయిర్ ఇండియా విమానం నాన్ షెడ్యూల్డ్ కమర్షియల్ విమానాలను అమెరికా నుంచి భారత్‌లోని వివిధ ప్రాంతాలకు ఈ నెల 9 నుంచి 15 వరకు నడిపింది.
రెండవ దశలో అమెరికా నుంచి భారత్‌కు విమానాలను 19 నుంచి 29 వరకు నడుపుతోంది. రెండవ దశలో న్యూయార్క్ నుంచి ఢిల్లీకి, చండీగఢ్ నుంచి బెంగళూరుకు రెండు విమానాలు నడుపుతారు. అలాగే శాన్ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరు, హైదరాబాద్, కోచి, అహ్మదాబాద్‌లకు రెండు, వాషింగ్టన్ నుంచి బెంగళూరు, అహ్మదాబాద్ లకు ఒకటి, చికాగో నుండి ఢిల్లీ, భువనేశ్వర్, అహ్మదాబాద్, హైదరాబాద్‌లకు రెండు విమానాలు నడుపుతారు. వందేభారత్ మిషన్ మొదటి దశలో విదేశాల నుంచి మొత్తం 6527 మంది భారతీయులను తీసుకొచ్చారు.






