Dallas: డాలస్ లో మహాత్మాగాంధీ విగ్రహానికి కేటీఆర్ పుష్పాంజలితో ఘననివాళి

తెలంగాణా రాష్ట్ర పూర్వసమాచార సాంకేతిక (ఐటీ), మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, టెక్స్టైల్స్, ఎన్నారై అఫైర్స్ మంత్రి, భారాసపార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు (KTR) అమెరికాలో డాలస్ (Dallas) నగరంలో నెలకొనియున్న, దేశంలోనే అతి పెద్దదైన మహాత్మాగాంధీ విగ్రహాన్ని సందర్శించి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లుడుతూ అహింస, సత్యాగ్రహమే ఆయుధాలుగా దేశ ప్రజలందరినీ సమాయత్తపరచి, బ్రిటిష్ బానిస సంకెళ్లనుండి భారతదేశాన్ని విడిపించి స్వాతంత్ర్యం తీసుకువచ్చిన మహాత్మాగాంధీ కృషి ఎంతైనా కొనియాడ తగ్గది అన్నారు. అందుకే ప్రపంచం అంతా గాంధీజీని నేటికీ ప్రశంసిస్తూనే ఉంటారు. అలాంటి విశ్వనాయకుడి యుగపురుషుడి విగ్రహాన్ని యింత పెద్దఎత్తున డాలస్ (ఇర్వింగ్) నగరంలో నెలకొల్పడంలో మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర వారి కార్యవర్గసభ్యుల కృషిని అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక కార్యదర్శి రావు కల్వాల మాట్లాడుతూ “తెలంగాణా రాష్ట్ర సాధనలోను, దశాబ్దకాలంపాటు రాష్ట్ర అభివృద్ధిలోనుపూర్వ ముఖ్యమంత్రి కెసిఆర్, పూర్వ మంత్రి కేటీఆర్ మరియు వారి కుటుంబసభ్యులు చేసిన కృషి, త్యాగాలను తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరు అన్నారు. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం కేసీఆర్ మార్గనిర్దేశంలో కేటీఆర్ ఎంతో కృషి చేశారు. కెసీఆర్ విజన్ తెలంగాణకు ఒక గళాన్ని ఇచ్చింది. కేటీఆర్ విజన్ ద్వారా గ్లోబల్ దృక్పథంతో భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే సమగ్ర, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ నిర్మితమైంది. వారిరువురి నాయకత్వ కలయిక దశాబ్ద కాలంలోనే తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపింది” అన్నారు.
మహాత్మాగాంధీ మెమోరియల్ ఆఫ్ నార్త్ టెక్సస్ వ్యవస్థాపక అధ్యక్షులు డా. ప్రసాద్ తోటకూర భారాస పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కెటిఆర్ కు, వారితో పాటు తెలంగాణ రాష్ట్రంనుండి విచ్చేసిన రాజకీయ నాయకులకు ఆహ్వానంపలికి మాట్లాడుతూ – అమెరికా దేశంలోనే అతి పెద్దదైన ఈ మహాత్మాగాంధీ స్మారక స్థలిని నిర్మించి10 సంవత్సరాలు పూర్తయిందని, ఈ నిర్మాణం ప్రవాస భారతీయుల సమిష్టి కృషికి, ఐకమత్యానికి నిదర్శనమని, దీన్ని సాకారం చెయ్యడంలో అనుమతులిచ్చిన నగర అధికారులకు, సహకరించిన దాతలకు, కార్యవర్గ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు అన్నారు. ప్రాంతాలకు, పార్టీలకు అతీతంగా డాలస్ ప్రాంతసందర్శనకు వచ్చిన రాజకీయ నాయకులు, ప్రముఖులు, స్థానిక రాజకీయ నాయకులు, సాధారణ పౌరులు అనునిత్యం ఈ గాంధీజీ స్మారకస్థలిని సందర్శిస్తూనే ఉంటారు అన్నారు. తీరికలేని కార్యక్రమాలలో ఉంటూ కూడా వీలుచేసుకుని వచ్చి, గాంధీజీకి నివాళులర్పించిన కెటిఆర్ ను బోర్డ్ సభ్యులు – రావుకల్వాల, బి. ఎన్ రావు, తైయాబ్ కుండావాల, మురళివెన్నం, రాజేంద్ర వంకావాల, అనంత్ మల్లవరపు, వినోద్ఉప్పు, షబ్నం మాడ్గిల్లతో కలసి డా. ప్రసాద్ తోటకూర ఘనంగా సన్మానించారు.
వందలాది ప్రవాసభారతీయులు పాల్గొన్నఈకార్యక్రమంలో- కోపెల్ సిటీకౌన్సిల్ మెంబర్ రమేష్ ప్రేమ్ కుమార్, ఎన్నారై భారాస అమెరికా విభాగ అధ్యక్షుడు తన్నీరు మహేష్, ఎన్నారై భారాస గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేష్, ఎల్.రమణ, తాతా మధు, నవీన్ రెడ్డి, గ్యాదరి బాలమల్లు, సుధీర్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి, కర్నె ప్రభాకర్, శ్రీనివాస్ రెడ్డి, బాల్క సుమన్, గువ్వల బాలరాజు, గండ్ర వెంకటరమణ రెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు, పెద్ది సుదర్శన్ రెడ్డి, చల్లా ధర్మారెడ్డి, గాదరి కిషోర్, క్రాంతి కిరణ్, పైలట్ రోహిత్ రెడ్డి, కోరుకంటి చందర్, నోముల భగత్, బాణొత్ చంద్రవతి, గండ్ర జ్యోతి, దామోదర్, జాన్సన్ నాయక్, అమరెందర్ రెడ్డి, రఘువీర్ సింగ్, యుగంధర్ రావు, విష్ణువర్ధన్ రెడ్డి, అభిలాష్ రంగినేని, సోమ ఉపేందర్ గౌడ్, వంశీ రెడ్డి, అరవింద్ రావు తక్కెళ్లపల్లి, తదితరులు పాల్గొన్నారు.