గూగుల్ ఉద్యోగులకు బంపర్ ఆఫర్
టెక్ దిగ్గజం గూగుల్ తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేసేలా, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా కార్యాలయాలను నడిపేలా కంపెనీలన్నీ దృష్టి సారిస్తున్నాయి. అందులో భాగంగానే గూగుల్ తమ ఉద్యోగులకు 1000 డాలర్లు భత్వంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది. ఇంటి నుంచి పనిచేసే ఉద్యోగులకు అవసరమైన ల్యాప్టాప్, ఇతర హార్డ్వేర్ పరికరాల కొనుగోలు నిమిత్తం ఈ సహకారం అందిస్తున్నట్లు గూగుల్, అల్ఫాబెట్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. మరి కొన్ని నెలలు కూడా గూగుల్ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తారన్న అంచనాలతో ప్రతి ఉద్యోగికి 1000 డాలర్ల భత్యం ఇవ్వాలనుకున్నాం. ఇంటి నుంచి పనిచేసేందుకు వీలుగా ఆఫీసు అవసరాల కోసం ఆ మొత్తాన్ని ఇస్తున్నాం అని ఉద్యోగులకు రాసిన లేఖలో వెల్లడించారు. ఈ క్లిష్ట సమయంలో ఉద్యోగులకు మనోదైర్యాన్ని ఇవ్వడంతో పాటు, కంపెనీ తమ కోసం ఉందన్న భరోసాను కలిగిస్తుందని చెప్పారు. జూలై 6 నాటికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమ కార్యాలయాలను ఎక్కువ సంఖ్యలో తెరిచేందుకు గూగుల్ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. ఆయా నగరాల పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామని పిచాయ్ తెలిపారు. భౌతిక దూరం వంటి నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో, రొటేషన్ పద్ధతిలో ఉద్యోగులు హాజరయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు.






