FIA: ఎఫ్ ఐ ఎ న్యూయార్క్ ఇండియా డే వేడుకలు విజయవంతం

వేడుకల్లో పాల్గొన్న అమెరికా ప్రతినిధులు…
క్రిక్కిరిసిపోయిన న్యూయార్క్ వీధులు
న్యూయార్క్ నగరంలో ఆగస్టు 17వ తేదీన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (FIA) ఆధ్వర్యంలో జరిగిన ఇండియా డే వేడుకల్లో పెద్ద ఎత్తున ఎన్నారైలు, భారతీయ సంఘాలు పాల్గొని దేశభక్తిని చాటాయి. దాదాపు లక్షలమంది పాల్గొన్న ఈ 43వ వార్షిక ఇండియా డే పరేడ్ లో ‘వందేమాతరం’’, ‘‘భారత్ మాతా కీ జై’’ వంటి దేశభక్తి నినాదాలు మిన్నంటాయి. మాడిసన్ అవెన్యూలో జరిగిన ఈ కార్యక్రమంలో భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని అద్భుతంగా చాటిచెప్పారు. ‘‘సర్వే సుఖినా భవంతు’’ అన్న ఇతివృత్తంతో ఈ పెరెడ్ ను నిర్వహించారు. ఈ పరేడ్‌లో 34 ఆకర్షణీయమైన శకటాలు (ఫ్లోట్స్), 21 మార్చింగ్ బృందాలు, 20 సాంస్కృతిక ప్రదర్శనలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలను ప్రతిబింబించేలా ఏర్పాటు చేశారు. అన్నిటికంటే ఎత్తుగా ఉన్న ఇస్కాన్ వారి జగన్నాథ్ రథ యాత్ర శకటం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. క్రిక్‌మాక్స్ కనెక్ట్ శకటం అమెరికన్ యువ క్రికెట్ విప్లవాన్ని ప్రతిబింబించింది. అనేక మంది పిల్లలు మాడిసన్, పార్క్ అవెన్యూలలో క్రికెట్ ఆడటం, ఈ క్రీడ ప్రాచుర్యాన్ని చాటిచెప్పింది. సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఆకట్టుకున్నాయి.
తెలుగు సినిమాల్లో పాపులర్ హీరోగా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక ఈ పెరేడ్ కు గ్రాండ్ మార్షల్స్ గా వ్యవహరించారు. ఇద్దరూ జంటగా న్యూయార్క్ వీధుల్లో సందడి చేశారు. ఇండియా డే వేడుకల్లో పాల్గొన్న అభిమానులను, ఎన్నారైలను, భారతీయ సంఘాల సభ్యులను ఉత్సాహపరిచారు. పరేడ్‌లో వీరు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
అమెరికా ప్రతినిధుల హాజరు
న్యూయార్క్ సిటీ మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఈ పెరెడ్ లో పాల్గొని ఎన్నారైలు చేస్తున్న మంచిపనులను, దేశభక్తిని ప్రశంసించారు. యునైటెడ్ స్టేట్స్ కాంగ్రెస్ సభ్యుడు శ్రీ థానేదార్ ఈ పరేడ్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ప్రజల్లో ఉన్న ఉత్సాహం చూస్తుంటే ఆనందంగా ఉందన్నారు. యువత రాజకీయాల్లోకి వచ్చి తమ భవిష్యత్తును మెరుగుపరుచుకోవాలని పిలుపునిచ్చారు. న్యూయార్క్‌లోని భారత కాన్సుల్ జనరల్ బినయ శ్రీకాంత ప్రధాన్ మాట్లాడుతూ, లక్షల మందితో మాడిసన్ అవెన్యూలో భారతదేశ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని, అమెరికాలో భారతీయ-అమెరికన్ సమాజం ఎంత ప్రాముఖ్యత సాధించిందో ఈ పెరేడ్ తెలియజేస్తున్నదని అన్నారు. విదేశీ వ్యవహారాలు, విద్యపై స్టాండింగ్ కమిటీలో ఉన్న భారత పార్లమెంట్ సభ్యుడు సత్నం సింగ్ సంధూ ఈ కార్యక్రమానికి రెండవసారి హాజరయ్యారు. వీరితోపాటు మోంట్‌గోమరీ టౌన్‌షిప్ మేయర్ నీనా సింగ్, న్యూయార్క్ స్టేట్ ఎగ్జిక్యూటివ్ ఛాంబర్ డైరెక్టర్ సిబు నాయర్, అలాగే ఇండియన్ ఆరిజిన్ ఫిజీషియన్స్ అమెరికన్ అసోసియేషన్ (ఆపి) అధ్యక్షుడు డాక్టర్ అమిత్ చక్రవర్తి వంటి స్థానిక, రాష్ట్ర నాయకులు కూడా ఈ పరేడ్‌లో పాల్గొన్నారు.
ఎఫ్‌ఐఎ నాయకుల ప్రశంసలు
ఎఫ్‌ఐఏ అధ్యక్షుడు సౌరిన్ పారీఖ్ మాట్లాడుతూ, ఈ పరేడ్ భారతీయ అమెరికన్ సమాజం యొక్క బలం, ఐక్యతకు నిదర్శనంగా నిలిచిందన్నారు. వివిధ ప్రాంతాల నుండి భారతీయ కుటుంబాలు ఈ పెరేడ్ కు వచ్చి ఇండియా డే వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా గర్వంగా ఉందన్నారు.
ఎఫ్‌ఐఏ ఛైర్మన్ అంకుర్ వైద్య మాట్లాడుతూ, ఈ పరేడ్ సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేస్తుందని, భారతీయ-అమెరికన్ సమాజం యొక్క శక్తివంతమైన స్ఫూర్తిని మరోసారి చూపించిందన్నారు.