CAA: కన్నుల పండుగగా చికాగో ఆంధ్ర సంఘం వారి 9వ వార్షికోత్సవ వేడుకలు

ఓ అందమైన సాయంత్ర వేళ, ఆప్తులైన వారి తో కలిసి, ఆహ్లాదకరమైన వాతావరణంలో, బుజ్జి బుజ్జి చిన్నారుల నుండి పెద్దల వరకు మన సంస్కృతి – సంప్రదాయాలను ప్రతిబింబించేలా, కొత్త – పాతల కలయికతో రూపొందించిన కార్యక్రమాలను చూసి, చిన్నప్పటి అమ్మ చేతి వంటల్ని గుర్తుకు తెచ్చేలా వండిన విందుభోజనాన్ని ఆస్వాదిస్తూ, దైనందిన జీవితంలో ఎదురయ్యే ఒత్తిడులను కాసేపు పక్కనపెట్టి, గడిపిన ఆ సాయంత్రం ఎంత ఆనందంగా ఉండేదో కదా!
ఏప్రిల్ 27, 2025 తేదీన, Naperville లోని YellowBox ఆడిటోరియంలో చికాగో ఆంధ్ర సంఘం (CAA) వారు నిర్వహించిన 9వ వార్షికోత్సవ వేడుకలకు హాజరైన ఆహ్వానితులు అచ్చం అలాంటి అనుభూతినే పొందారు.
2025 సంవత్సరానికి సంస్థ అధ్యక్షులైన శ్రీకృష్ణ మతుకుమల్లి, చైర్మన్ శ్రీనివాస్ పెద్దమల్లు మరియు ఇతర కార్యవర్గ సభ్యులు స్పాన్సర్స్ సహకారంతో జరిగిన ఈ కార్యక్రమానికి చికాగో పరిసర ప్రాంతాలనుండి 1000 మందికి పైగా ఆహ్వానితులు విచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన కౌన్సిల్ జనరల్ శ్రీ సోమనాథ్ ఘోష్ గారు, భారతదేశం లోని పహల్గామ్ లో తీవ్రవాదులు జరిపిన అమానవీయమైన దాడిని ఖండించారు. ఇలాంటి హెయమైనా దాడి జరిపిన తీవ్రవాద మూకలకు, వారి వెనుకాల ఉండి ఇలాంటి చర్యలకు ప్రోత్సహిస్తున్న వారికి బుధ్ధి వచ్చేలా భారతదేశం కఠినమైన చర్యలు తీసుకోవాలని ఆకాంక్షించారు. మతాన్ని ముసుగుగా చేసుకుని, తీవ్రవాదులు మతం పేరు అడిగి మరీ పర్యాటకులపై కాల్పులు జరిపిన దారుణ ఘటనను తలుచుకుని భావోధ్యేగానికి గురవుతూ, ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా భారత దేశం తీసుకొనే ఎలాంటి చర్యకైనా అందరి సహాయ సహకారాలు అందించాలని సభికులని అభ్యర్ధించారు.ఈ ప్రసంగానికి ముందు, సంస్థ చైర్మన్ శ్రీనివాస్ పెదమల్లు గారి కోరిక మేరకు, సభకు హాజరైనవారంతా తీవ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి ఆత్మకు శాంతి చేకూరేలా ఒక నిమిషం పాటు మౌనంగా నివాళి అర్పించారు.
ప్రముఖ నేత్ర వైద్యులు, గ్లాకోమా నిపుణులు, వైద్యవిద్యా పరిశోధకులు మరియు సమాజ సేవకులు Dr. శ్రీరామ్ శొంఠి గారికి, వారి సతీమణి బహుముఖ ప్రజ్ఞాశాలి, విశిష్ట రచయిత, సంగీత నిపుణురాలు, తత్త్వవేత్త మరియు విద్యావేత్తగా భారత సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ స్థాయిలో విస్తరించిన Dr. శారద పూర్ణ సుసర్ల శొంఠి గారికి, సంస్థ అధ్యక్షులు శ్రీకృష్ణ మతుకుమల్లిజీవిత సాఫల్య పురస్కారం అందజేస్తూ, ఈ దంపతులు ఇద్దరూ సమాజానికి, భాషకి, దేశానికీ, సంస్కృతికి, భావితరాల అభున్నతికి చేసిన సేవలను కొనియాడుతూ, ఈ పురస్కారాన్ని స్వీకరించటానికి వచ్చిన సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేసారు.
ఈ సందర్భంగా Dr. శ్రీరామ్ శొంఠి గారు, సేవాతత్పరత గురించి మాట్లాడుతూ, సేవాతత్పరత వలన మనం ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని , సమాజంలోని ప్రతి ఒక్కరు సేవా నెరతిని కలిగి ఉండాలని, సేవా తత్త్వం, పరోపకారం వలనే తాను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానని సభికులకు తెలియజేశారు.సేవ ద్వారా మన ఆత్మానందం పెరుగుతుందనీ, అది నిజమైన జీవన విధానమని ఆయన స్పష్టం చేశారు.
అనురాధ గంపాల, ఒగ్గు నరసింహారెడ్డి, హేమంత్ తలపనేని, కిరణ్ వంకాయలపాటి, పద్మారావు అప్పలనేని ఆధ్వర్యంలో బృందం కార్యక్రమానికి వచ్చిన అతిధులకు స్వాగతం పలుకుతూ వారి సభ్యత్వాలు నమోదు చేసుకుని ప్రవేశ పట్టీలను (wrist band) అందజేశారు.
శైలజా సప్ప గారి ఆధ్వర్యంలో, సంస్థ ఉపాధ్యక్షురాలు తమిస్రా కొంచాడ గారి సహకారంతో అకేషన్ బై కృష్ణ – కృష్ణ జాస్తి గారు ఉగాది సంబరాలను కళ్ళకు కట్టేలా సభా ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు.
అనూష బెస్తా, స్మిత నందూరి, శైలజ సప్ప గార్లు స్వాగత సందేశంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో, 260 కళాకారులతో రూపొందించిన 40 కి పైగా ప్రదర్శనలు అన్ని వయస్సుల వారిని ఎంతగానో ఆకట్టుకున్నాయి. రమ్య మైనేని, సైని నర్వాల్, హరిణి మేడ , మరియు శివ పసుమర్తి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. 30 మందికి పైగా కళాకారులతో రూపొందించిన ఉగాది శ్రీరామనవమి నృత్య రూపకం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
Asha Acharya Academy మరియు Lasyam School of Dance విద్యార్థులు ప్రదర్శించిన సాంప్రదాయ నృత్య ప్రదర్శన వీక్షకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసింది. ఇక ఈ సాంస్కృతిక కార్యక్రమానికి ప్రధాన ఆకర్షణ ఒగ్గు నరసింహారెడ్డి మార్గదర్శకత్వంలో రూపొందించిన “ఏమి తింటే తగ్గుతాం ” దృశ్యరూపకం వీక్షకులను కడుపుబ్బ నవ్వేలా చేసింది.
శ్వేత కొత్తపల్లి, ప్రియా మతుకుమల్లి, హేమంత్ తలపనేని, నరసింహారావు వీరపనేని, లక్ష్మీనాగ్ సూరిభొట్ల , అభిరాం నండూరి, ఆధ్య బెస్త మరియు సన్షిత కొంచాడ, తమ సహాయ సహకారాలను అందించారు. రామారావు కొత్తమాసు, గిరి రావు కొత్తమాసు అన్ని విభాగాలకు కావలసిన వస్తు సామగ్రి సమకూర్చారు. సాహితీ కొత్త మరియు, యువ డైరెక్టర్లు స్మరన్ తాడేపల్లి, శ్రియ కొంచాడ, మయూఖ రెడ్డివారి, స్వేతిక బొజ్జ ఆద్వర్యంలో పలువురు స్వచ్చంద సేవ విద్యార్థులు ఈ కార్యక్రమము అంతటా సహాయముగా నిలిచారు.
మురళి రెడ్డి వారి పర్యవేక్షణలో Desi Chowrasta నుండి మాలతి – పద్మాకర్ దామరాజు ఈ వేడుక కోసం పసందైన విందు భోజనాన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. తెలుగుదనం ఉట్టిపడేలా అలంకరించిన భోజనశాలలో. రుచికరమైన పదార్థాలను సాంప్రదాయమైన పాత్రలలో, సురేష్ ఐనపూడి, నరేష్ చింతమనేని, బోసు కొత్తపల్లి, హరి తోట, భార్గవి – ప్రసాద్ నెట్టెం, ఉమా కటికి, శివ బాల జాట్ల, ఇంకా ఇతర స్వచ్ఛంద సేవకులు రుచికరమైన భోజనాన్ని అతిధులకు కొసరి కొసరి వడ్డించగా భోజన శాలలో అతిదులందరికి శ్రీనివాస్ పెదమల్లు గారు పేరుపేరునా పలకరించారు . పిజ్జా ట్విస్ట్ వారు ఈ కార్యక్రమానికి వచ్చిన పిల్లల కోసం పిజ్జాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి 2024- 2025 సంవత్సరాలకు చైర్మన్ అయినటువంటి శ్రీనివాస్ పెదమల్లు, 2025 సంవత్సరానికి అధ్యక్షులైన శ్రీకృష్ణ మతుకుమల్లి, ఉపాధ్యక్షులు తమిశ్రా కొంచాడ, సంస్థ ట్రస్టీలు పవిత్ర – దినకర్ కరుమూరి, సుజాత – పద్మారావు అప్పలనేని, భార్గవి – ప్రసాద్ నెట్టెం , రాఘవ – శివబాల జాట్ల, మల్లేశ్వరి పెదమల్లు,ఉమా కటికి కార్యక్రమ నిర్వహణకు అన్ని విధాల తమ సహాయ సహకారాన్ని అందించారు.
ప్రభాకర్ మల్లంపల్లి మరియు ఉపాధ్యక్షులు తమిశ్రా కొంచాడ ఈ కార్యక్రమానికి వచ్చిన స్పాన్సర్స్ కి కావలసిన సదుపాయాలను సమకూర్చారు.
సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశాలలో ఒకటైన సేవా నెరతిని ముందుకు తీసుకువెళ్లే సంకల్పంతో స్థాపించిన చికాగో ఆంధ్ర ఫౌండేషన్ (CAF)చేస్తున్న సేవా కార్యక్రమాలను తాము ముందు ముందు చేపట్టనున్న సేవా కార్యక్రమాల వివరాలను CAF తరపున సునీత రాచపల్లి , సవివరముగా దృశ్య రూపములో ప్రదర్శించారు. CAF వారి విరాళాల సేకరణ లో భాగంగా, శ్రీమతి రమ్య రోడ్డం గారు ఎంతో నిపుణతో కళాత్మకంగా తయారు చేసిన చిత్రానికి నిర్వహించిన వేలంపాట లో పలువురు ఉత్సాహముగా పాల్గున్నారు. ఈ సందర్భంగా వెబ్ కమిటీ వారు CAA ఎక్కడైనా ఎప్పుడైనా (CAA Whenever Wherever)అనే నినాదంతో, విన్నూతనముగా తయారు చేసిన CAA Mobile App ను అందరికీ పరిచయము చేసారు.
ఈ కార్యక్రమం ఆద్యంతం శృతి కూచంపూడి వివిధ రకాల సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్ష ప్రసారం కావడానికి కావలసిన ఏర్పాట్లను చేసి అందరికీ వీక్షించే అవకాశము కల్పించారు.
చివరగా సమస్త తరపున కార్యదర్శి శ్రీ స్మిత నండూరి గారు కార్యక్రమానికి విచ్చేసి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షించి కళాకారులను తమ కరతాల ధ్వనులతో, ఈలలతో ఉత్సాహపరచిన ఆహ్వానితులు అందరికీ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. గత రెండు నెలలుగా CAA 9వ వార్షికోత్సవ సంబరాలను విజయవంతంగా నిర్వహించడం కోసం అహర్నిశలు శ్రమించిన సంస్థ ప్రతినిధులకు, కార్యవర్గ సభ్యులకు, స్వచ్ఛంద కార్యకర్తలకు, స్పాన్సర్స్ కు, పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేసి, జాతీయ గీతాలాపనతో ఈ కార్యక్రమాన్ని ముగించారు.