Babloo Prithiveeraj: పిలిచి మరీ నన్నెవరూ పట్టించుకోలేదు
యానిమల్(Animal), తండేల్(Thandel), అర్జున్ సన్నాఫ్ వైజయంతి(Arjun Sonof Vyjayanthi) వంటి వరుస హిట్ సినిమాలతో టాలీవుడ్లో వరుస అవకాశాలను అంది పుచ్చుకుంటున్న కన్నడ నటుడు బబ్లూ పృథ్వీరాజ్(Babloo Prithiveeraj)కు గతేడాది ఓ చేదు అనుభవం ఎదురైందట. ఈ విషయాన్నిఒక పాడ్‌కాస్ట్‌లో పృథ్వీరాజ్ చెప్పి చాలా బాధపడ్డాడు. నాలుగు దశాబ్దాలకు పైగా ఇన్ని సినిమాల్లో నటించాక కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవ్వడంపై పృథ్వీరాజ్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. దిలీప్ ప్రకాష్(Dileep Prakash)-రెజీనా(Regina) హీరోహీరోయిన్లుగా నటించిన ఉత్సవం మూవీ గతేడాది రిలీజవడం తెలిసిందే.
ఇందులో బ్రహ్మానందం(Brahmanandam), ప్రకాష్‌రాజ్(Prakash Raj), పృథ్వీరాజ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా షూటింగ్ కోవిడ్ ముందే చాలా వరకు పూర్తయినా పలు కారణాలతో రిలీజ్ ఆలస్యమైంది. ఈ మూవీ రిలీజ్ ముందు నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు చిత్ర బృందం గుర్తు పెట్టుకుని తనను కూడా ఆహ్వానించడంతో సంబరపడ్డానని పృథ్వీరాజ్ తెలిపాడు. ఈ ప్రీరిలీజ్ ఈవెంట్లో పాల్గొనేందుకు వేరే షూటింగ్‌లను కూడా వాయిదా వేసుకుని వెళ్లగా అక్కడ పరిణామాలకు చాలా బాధపడ్డానని పృథ్వీరాజ్ తెలిపాడు.
ప్రీరిలీజ్ ఈవెంట్‌కు వెళ్లాక సినిమా నిర్మాతలు, దర్శకుడిని పలకరించగా వాళ్లు తనతో సరిగ్గా మాట్లాడలేదని, సరే వాళ్లేదో ఈవెంట్ హడావిడిలో ఉన్నారని, స్టేజీ ముందు ఒక చోట కూర్చోగా ఎవరెవరో వస్తున్నారని తనను మూడు-నాలుగుసార్లు లేపి పక్కకు జరిగి కూర్చోమన్నారని పృథ్వీరాజ్ వాపోయాడు. ఆ తర్వాత స్టేజ్ పైకి అందరిని పిలిచి తనను ఆహ్మానించలేదని బాధపడ్డాడు. ప్రీరిలీజ్ ఈవెంట్ అయిపోయాక గ్రూప్ ఫోటో కోసం అందరిని పిలిచి, తనను కావాలని వెనకాల నిలబెట్టారని వాపోయాడు. ఈ గ్రూప్ ఫొటో కోసం తనతో పాటు వెనక వరుసలో నిలబడిన గిరిబాబును పిలిచి మరీ ముందు నిలబెట్టి తనని మాత్రం పిలవలేదని పృథ్వీరాజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.






