వాట్సప్ వినియోగదారులకు శుభవార్త
వాట్సప్ వినియోగదార్లకు శుభవార్త. పలు ఫోన్లలో ఒకే వాట్సప్ ఖాతాను వినియోగించుకునేలా వాట్సప్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. అంతర్జాతీయంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించామని, వచ్చే కొన్ని వారాల్లో ప్రతి ఒక్కరికీ ఇది అందుబాటులోకి వస్తుందని మెటా యాజమాన్యంలోని వాట్సప్ ప్లాట్‌ఫామ్ తెలిపింది. ఈ సదుపాయం గురించి చాలా మంది వినియోగదార్ల నుంచి ఎక్కువసార్లు అభ్యర్థనలు రావడంతో మరో 4 అదనపు ఫోన్లకు లింక్ చేసుకునే ఫీచర్‌ను ప్రవేశపెట్టామని పేర్కొంది. వెబ్ బ్రౌజర్లు, టాబ్లెట్లు, డెస్క్ టాప్లకు లింక్ చేసుకున్నట్టే 4 ఫోన్లకు కూడా ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది. వినియోగదార్లకు సంబంధించిన వ్యక్తిగత సందేశాలు, మీడియా, కాల్ అన్నీ ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్టెడ్‌గా ఉంటాయని వెల్లడించింది. ఒకవేళ ప్రధాన ఫోన్ చాలాసేపు ఇన్‌యాక్టివ్‌గా ఉంటే దానికి అనుసంధానమైన అన్ని ఫోన్లు ఆటోమేటిక్‌గా లాగ్ ఔట్ అవుతాయని వివరించింది.






