అమెరికా వీసా మరింత ప్రియం
అమెరికా వీసా మరింత ప్రియం కానుంది. నాన్ ఇమిగ్రెంట్ వీసా (ఎన్ఐవీ) ఫీజులను అమెరికా ప్రభుత్వం పెంచింది. పెంచిన ఫీజులు మే 30వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో పర్యాటక/ వ్యాపార, విద్యార్థి వీసాలతో పాటు తాత్కాలిక ఉద్యోగాల ప్రాతిపాదికన అమెరికా వెళ్లేవారి వీసాల ఫీజు పెరగనుంది. ఈ మేరకు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ ఒక ప్రకటన జారీ చేసింది. పర్యాటక/ వ్యాపార అవసరాల మీద అమెరికా వెళ్లేవారి వీసా ( బి1/బి2 కేటగిరీలు), విద్యార్థుల వీసా వంటి తర నాన్ ఇమిగ్రెంట్ వీసాల ఫీజును 160 అమెరికన్ డాలర్ల నుంచి 185 అమెరికన్ డాలర్లకు పెంచారు. తాత్కాలిక ఉద్యోగాల మీద అమెరికా వెళ్లేవారికి ఉద్దేశించిన పిటిషన్ బేస్డ్ ఇమిగ్రెంట్ ( హెచ్, ఐ, ఒ. పి. క్యూ, ఆర్ కేటగిరీలు) వీసాల ఫీజును 190 అమెరికన్ డాలర్ల నుంచి 205 అమెరికన్ డాలర్లకు పెంచారు. ఇక ట్రీట్ ట్రేడర్, ట్రీటీ ఇన్వెస్టర్, ట్రీటీ అప్లికెంట్స్కు ఉద్దేశించిన నాన్ ఇమిగ్రెంట్ ( ఇ కేటగిరి) వీసా ఫీజును 205 అమెరికన్ డాలర్ల నుంచి ఏకంగా 315 అమెరికన్ డాలర్లకు పెంచారు.
అమెరికా వీసా ఇంటర్వ్యూల కోసం గత ఏడాది అక్టోబరు 1వ తేదీ తరువాత చెల్లించిన ఫీజులు 365 రోజుల వరకు వర్తిస్తాయి. గత ఏడాది అక్టోబర్ 1వ తేదీ కంటే ముందు చెల్లించిన వీసా ఇంటర్వ్యూల ఫీజులు ఈ ఏడాది సెప్టెంబరు 30వ తేదీ వరకే వర్తిస్తాయి. కాబట్టి ఆ వీసా దరఖాస్తుదారులు తమ వీసా ఇంటర్వ్యూను ముందుకు జరుపుకోవాలని, లేదా సెప్టెంబరు 30వ తేదీలోగా వీసా ఉపసంహరణకు దరఖాస్తు దాఖలు చేయాలని యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ సూచించింది.






