భారత్ కు ప్రధాన వాణిజ్య భాగస్వామిగా అమెరికా
గత ఆర్థిక సంవత్సరంలో మన దేశానికి అమెరికా అతి పెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఇరుదేశాల మధ్య ఆర్థిక సంబంధాలు మరింత బలోపేతం కావడం ఇందుకు నేపథ్యం. వాణిజ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాత్కాలిక గణాంకాల ప్రకారం భారత్-అమెరికాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం గత ఆర్థిక సంవత్సరంలో 128.55 బిలియన్ డాలర్లకు చేరింది. 2021-22లో 119.5 బి.డాలర్లు, 2021-21లో 80.50 బి. డాలర్లుగా నమోదైంది. భారత్ నుంచి అమెరికాకు ఎగుమతులు 78.31 బి. డాలర్లకు చేరాయి. 2021-22 నాటి 76.18 బి.డాలర్ల కంటే ఇవి 2.18 శాతం అధికం. అమెరికా నుంచి దిగుమతులు 16 శాతం పెరిగి 50.24 బి. డాలర్లుగా నమోదయ్యాయి. చైనాతో ద్వైపాక్షిక వాణిజ్యం 115.42 బి. డాలర్ల నుంచి 1.5 శాతం తగ్గి 113.83 బి.డాలర్లకు పరిమితమైంది. భారత్తో యూఏఈ ద్వైపాక్షిక వాణిజ్యం 76.16 బి.డాలర్లతో మూడో స్థానం పొందింది. తర్వాత స్థానాల్లో సౌదీ అరేబియా (52.72 బి.డాలర్లు), సింగపూర్ (35.55 బి.డాలర్లు) ఉన్నాయి.






