హైదరాబాద్ లో అమెరికా ఎసెంట్
అరోగ్యరక్షణ, బీపీవో సేవల్లో అగ్రగామిగా వెలుగొందుతున్న అమెరికాకు చెందిన ఎసెంట్ గ్రూపు తాజాగా హైదరాబాద్‌లో అడుగుపెట్టింది. ఉప్పల్‌లో ఉన్న ఎరెనా సెజ్‌లో తన కార్యాలయాన్ని ప్రారంభించింది. 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో 300 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత పరీక్షకాంలో ఇక్కడ నుంచి మంచి ఎదుగుదలకు అవకాశం ఉంటుందన్న అంచనాతో సెంటర్‌ను ఆరంభించినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆ సంస్థ కోల్‌కతా, నాగర్‌పూర్‌లో కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా కంపెనీ హెచ్ఆర్ విభాగ డైరెక్టర్ టామ్ ఎలెన్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో టెక్నాలజీ పరంగా తగిన అర్హతలున్నవారు చాలా మంది ఉన్నారని, దీంతో ఇక్కడ సెంటర్‌ను నెలకొల్పాలని నిర్ణయించామని చెప్పారు. ప్రస్తుతం 300 మంది సిబ్బందితో నడుస్తున్న ఈ కార్యాలయాన్ని భవిష్యత్తులో మరింత విస్తరించనున్నట్లు ఆయన ప్రకటించారు.






