అమెరికాలో కొత్తగా 2,36,000 ఉద్యోగాలు
మార్చిలో అమెరికా కంపెనీలు కొత్తగా 2,36,000 ఉద్యోగాలు సృష్టించాయి. గత ఏడాది నుంచి ఇప్పటివరకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ 9 సార్లు వడ్డీ రేట్లు పెంచినప్పటికీ ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ విపణి బలంగానే ఉన్నట్లు తాజా గణాంకాలు స్పష్టం చేశాయి. మార్చిలో నిరుద్యోగ రేటు 3.5 శాతంగా నమోదైంది. ఈ ఏడాది జనవరిలో నిరుద్యోగ రేటు 53 ఏళ్ల కనిష్ఠమైన 3.4 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో కొత్తగా వచ్చిన 3,26,000 ఉద్యోగాలతో పోలిస్తే మాత్రం మార్చిలో కొంత తగ్గింది. ద్రవ్యోల్బణ ఒత్తిళ్లూ తగ్గే సూచనలు కనిపిస్తున్నట్లు కార్మిక విభాగం తెలిపింది. ఫలితంగా వడ్డీ రేట్ల పెంపునకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ తాత్కాలికంగా విరామం ఇచ్చే అవకాశం ఉంది. ఏడాది క్రితంతో పోలిస్తే మార్చిలో సగటు గంటల వేతనాలు 4.2 శాతం పెరిగాయి. ఫిబ్రవరిలో నమోదైన 4.6 శాతంతో పోలిస్తే ఇది తక్కువే.






