చైనా కంపెనీలపై మరోసారి కొరడా?
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ముందుగా చెప్పినట్లే చైనా కంపెనీలపై మరోసారి ఆంక్షలు కొరడా ఝలిపించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ముప్పైకి పైగా చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో చేర్చిన ట్రంప్, తాజాగా మరో నాలుగు సంస్థలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. వీటిలో సెమీకండక్టర్ తయారీ సంస్థ, చైనా ఆయిల్ కార్పొరేషన్ వంటి ప్రధాన సంస్థలు ఉండబోతున్నట్లు సమాచారం. అమెరికాలో పెట్టుబడులు పెట్టకుండా నిషేధిత జాబితాలో ఈ కంపెనీలను చేర్చుతున్నట్టు అమెరికా డిపార్టుమెంటు ఆఫ్ డిఫెన్స్ ప్రకటించింది. ఇదివరకే నిషేధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఆదేశాలు జనవరి నుంచి అమలులోకి రానున్నాయి.
చైనీస్ మేనేజర్ టెక్ సంస్థ నేషనల్ ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్, ఎక్సపోర్ట్ కార్పొరేషన్(సీఈఐఈసీ)పై అగ్రరాజ్యం తాజాగా ఆంక్షలు విధించింది. వెనిజులాతో వ్యాపార సంబంధాలను కారణంగా చూపుతూ చర్యలు చేపట్టింది. ఈ ఆంక్షలు సీఈఐఈసీతో అమెరికా సంస్థల లావాదేవీలను పరిమితం చేస్తాయి. 50 శాతం అంతకంటే ఎక్కువ వాటా కలిగివున్న అనుబంధ సంస్థ ఆస్తులను స్తంభింపజేస్తుంది. అమెరికా ఆంక్షలున్నప్పటికీ, చైనాకు వెనిజులా ప్రత్యక్షంగా చమురు రవాణా ప్రారంభించింది. దీంతో ట్రంప్ ఆగ్రహించారని తెలుస్తోంది.






