Donald Trump : భారతీయులను నియమించుకోవద్దు.. టెక్ కంపెనీలకు ట్రంప్ హెచ్చరిక

గూగుల్ (Google), మైక్రోసాఫ్ట్ (Microsoft) వంటి టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి, అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వార్నింగ్ ఇచ్చారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సు (AI Conference) లో ట్రంప్ మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్‌సెట్‌ను ఆయన విమర్శించారు. అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు. మన దేశంలోని చాలా భారీ టెక్ కంపెనీలు చైనా (China)లో కంపెనీలు నిర్మిస్తూ, భారతీయ ఉద్యోగులను నియమించుకొంటూ, ఐర్లాండ్‌ను అడ్డంపెట్టుకొని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయి. ఆ విషయం మీకు తెలుసు. ఇక్కడి ప్రజల అవకాశాలను పట్టించుకోవడం, నిర్లక్ష్యం చేయడం వంటివి చేశారు. ట్రంప్ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయి. ఏఐ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరం. ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమే. దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలి. మీరూ అది చేయాలి. అదే నేను కోరుతున్నాను అని ట్రంప్ పేర్కొన్నారు.